అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రధానంగా బీఆర్ఎస్‌లో తీవ్ర కలకలం రేపిన ఎమ్మెల్సీ కవిత బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. సస్పెన్షన్ (Suspension) తర్వాత ఆమె తొలిసారి మీడియా ముందుకు రానున్నారు.
ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. అయితే, కవిత మీడియా సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, శ్రేణులకు గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే హరీశ్‌రావు, సంతోష్‌రావు, జగదీశ్‌రెడ్డి వంటి పలువురు నేతలపై తీవ్ర విమర్శలు చేసిన కవిత (MLC Kavitha).. ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిదే అంశం బీఆర్ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.
MLC Kavitha | సస్పెన్షన్ వేటు..
కవిత కొంతకాలంగా పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పొమ్మన లేక పొగ బెడుతున్నారని భావించిన ముఖ్య నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పరోక్షంగా కేటీఆర్‌పై (KTR) విమర్శలు చేసిన కవిత.. తాజాగా హరీశ్‌రావు, సంతోష్‌రావును టార్గెట్‌గా చేసి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ (KCR) నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేసీఆర్ ఆమెను దూరం పెట్టాలని నిర్ణయించారు.
MLC Kavitha | విమర్శలు చేసిన నేతలు..
కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్న కవితపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని బీఆర్ఎస్ నేతలంతా స్వాగతించారు. ఈ క్రమంలో కవితను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయాల్లోని కవిత ఫొటోలను తొలగించారు. కొన్నిచోట్ల ఆమె దిష్టిబొమ్మలను దహనం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, గొంగిడి సునీత, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్ వంటి ముఖ్య నేతలు కవితను విమర్శించారు. కవిత తన గొయ్యి తానే తవ్వుకున్నారని సత్యవతి రాథోడ్ (Satyavati Rathod) విమర్శలు చేశారు. పార్టీపై విమర్శలు చేసిన ఆమె ఉంటే ఎంత.. పోతే ఎంత అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌కు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారారని పలువురు నేతలు ఆరోపించారు.
MLC Kavitha | బీఆర్ఎస్ కేడర్‌లో ఆందోళన
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత బుధవారం మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఏం మాట్లాడతారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్యుల్లోనూ ఆసక్తి నెలకొంది. ప్రధానంగా బీఆర్ఎస్ కేడర్‌ను (BRS Cadre) తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తనపై విమర్శలు చేసిన ఉద్యమ పార్టీ నేతలపై ఆమె ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao), సంతోష్‌రావు(Santosh Rao)లపైనే విమర్శలు ఎక్కుపెట్టిన కవిత.. తాజాగా తనను విమర్శించిన వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.