అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీ20 ఫార్మాట్లో దూసుకుపోతోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సూర్య, తన అగ్రెసివ్ మైండ్‌సెట్‌తో పాటు పాజిటివ్ నాయకత్వంతో జట్టుపై తన ముద్ర వేశారు.
ఆయన సారథ్యంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అయితే 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు కెప్టెన్‌గా చివరి మెగా టోర్నీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వయస్సు పెరుగుతుండటం, ఇటీవలి కాలంలో బ్యాటింగ్‌లో స్థిరత్వం కొరవడటం వంటి అంశాలు బీసీసీఐ (BCCI)ని లాంగ్ టర్మ్ కెప్టెన్‌పై ఆలోచించాల్సిన పరిస్థితికి తీసుకువచ్చాయి. దీంతో 2026 వరల్డ్ కప్ తర్వాత టీ20 జట్టును నడిపించే నాయకుడెవరు అన్న దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఈ రేసులో ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్లు హాట్ ఫేవరెట్లుగా నిలుస్తున్నారు.
Team India | ఈ ముగ్గురిలో ఒకరు…
ఈ జాబితాలో ముందువరుసలో ఉన్న పేరు శుభ్‌మన్ గిల్. టీమిండియా తదుపరి సూపర్ స్టార్‌గా భావించబడుతున్న గిల్‌పై బీసీసీఐకు అపారమైన నమ్మకం ఉంది. ప్రస్తుతం అతని ఫామ్ కాస్త అటుఇటుగా ఉన్నా, టెస్టులు, వన్డేల్లో కీలక పాత్ర పోషిస్తూ జట్టుకు భవిష్యత్ ముఖచిత్రంగా మారాడు. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలనే ఆలోచన బోర్డులో బలంగా ఉంది. ఆ వ్యూహానికి గిల్ (Subhman Gill) పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. వయస్సు పరంగా చూసినా గిల్ మరో పదేళ్ల పాటు భారత జట్టును నడిపించే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అందుకే సూర్య తర్వాత సహజంగా కెప్టెన్సీ పగ్గాలు అందుకునే ఆటగాడు గిల్లేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఇక రెండో ప్రధాన అభ్యర్థిగా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నిలుస్తున్నాడు. కెప్టెన్‌గా అయ్యర్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ అద్భుతమైనదనే చెప్పాలి. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడం, ఆ తర్వాత ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లడం అతని నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అయ్యర్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంతేకాదు, ఐపీఎల్ 2025లో బ్యాటర్‌గా కూడా 175కు పైగా స్ట్రైక్ రేట్‌తో 600కు పైగా పరుగులు సాధించి తన ఫామ్‌ను చాటుకున్నాడు. ఫిట్నెస్ సమస్యలు దూరంగా ఉంటే, టీ20 ఫార్మాట్లో సూర్యకు సరైన వారసుడు శ్రేయస్ అయ్యరేనన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది.
మూడో అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు అక్షర్ పటేల్. టీమిండియాలో ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషిస్తున్న అక్షర్‌కు ఇటీవల టీ20 వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడమే అతను భవిష్యత్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడన్న సంకేతంగా మారింది. మైదానంలో చాలా కూల్‌గా ఉండే అక్షర్, వ్యూహాత్మకంగా ఆలోచించడంలో ఎంఎస్ ధోనీ తరహా ప్రశాంతత చూపిస్తాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. సీనియర్ ఆటగాడిగా జట్టులో అందరితో మంచి అనుబంధం ఉండటం కూడా అతనికి పెద్ద ప్లస్. ఒకవేళ బీసీసీఐ యువత కన్నా అనుభవానికి ప్రాధాన్యం ఇస్తే, అక్షర్ పటేల్ అదృష్టం పండే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.