అక్షరటుడే, మెండోరా : Pochampad Village | ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను చూసేందుకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
నిజామాబాద్ జిల్లా మెండోరా (Mendora) మండలంలోని పోచంపాడ్ గ్రామంలో ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్ట్(SRSP Project)తో ఈ గ్రామం పర్యాటకంగా, అంతేగాక ఆధ్యాత్మికంగానూ ప్రత్యేకత సంతరించుకుంది. దీంతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఎస్సారెస్పీకి వస్తుంటారు. కానీ, ఈ మార్గంలో సరైన వీధి దీపాల వ్యవస్థ లేకపోవడంతో తరచూ వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
Pochampad Village | వీధి దీపాల్లేక పోతున్న ప్రాణాలు..
ఈ మార్గంలో వీధి దీపాలు లేక ఇటీవల ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. తెల్లవారు జామున గ్రామానికి (Pochampad Village) చెందిన అఖిల్ అనే యువకుడు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వీధి దీపాలు (Street Lights) లేకపోవడం, ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదం జరిగింది. గతంలోనూ పలువురు వాహనదారులు, పర్యాటకులు ప్రమాదాలబారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి పోచంపాడ్ నుంచి ఎస్సారెస్పీ మార్గంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు భద్రత సూచికలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Pochampad Village | అర్ధంతరంగా నిలిచిన పనులు..
2014లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నుంచి పోచంపాడ్ ఎక్స్‌రోడ్–44 హైవే వరకు సుమారు 3.2 కి.మీ. పొడవైన రహదారిపై సెంట్రల్ లైటింగ్ (Central Lighting) ఏర్పాటు చేశారు. కొన్నేళ్లు బాగానే ఉన్నా.. తరువాత వాటి నిర్వహణ లేక వెలగడం లేదు. 2023లో సెంట్రల్ లైటింగ్ బాధ్యతలు ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించగా, వారు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. అయితే, గుత్తేదారు అనారోగ్యంతో మృతి చెందడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.
Pochampad Village | ముందుకొస్తున్న యువత..
అధికారులు పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక గ్రామానికి చెందిన యువకుడు డేగా దేవేందర్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన యువకులు స్పందించారు. పరశురాం, బిట్టు, నితీష్, అయాన్, ఋత్విక్, దేవేందర్ అనే యువకులు తమ సొంత ఖర్చుతో ప్రాజెక్టు నుంచి గ్రామంలోని రోడ్డు వరకు పక్కన ఉన్న చెట్లు, వీధి దీపాలు, యూటర్న్‌ల వద్ద అన్నింటికి రేడియంతో స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదాలు కొద్ది మేరయినా తగ్గుతాయంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.