అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Surya Kumar | పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంత రొచ్చగొట్టినా తాము సంయమనం పాటించామని.. ఆటతోనే తగిన బదులిచ్చామని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆసియా క్రికెట్ కప్‌లో (Asia Cup) విజయం సాధించిన అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా అతడు ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. పాక్ ఆటగాళ్లు ఎంతో కవ్వించినా.. తాము ఆటతోనే గట్టిగా బదులిచ్చామని చెప్పారు. ఆటలో దూకుడు ఉండాలని, కానీ అతిగా ఉండొద్దని తెలిపారు. పాకిస్తాన్ క్రికెటర్లే (Pakistan Cricketers) అన్ని హద్దులు దాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా దూకుడుగా వ్యవహరించామని కానీ వారిలా తాము లైన్ దాటలేదని చెప్పారు. “కొంచెం దూకుడు సరే, కానీ వారు (పాకిస్తాన్ ఆటగాళ్లు) అన్ని లైన్లు దాటారు, మేము అలా చేయలేదు. వారికి మా క్రికెట్‌తోనే సరైన రీతిలో జవాబు చెప్పామని” అని సూర్య అన్నారు.
Surya Kumar | ట్రోఫీ తీసుకోక పోవడంపై..
ఆసియా కప్‌ను తీసుకోకుండా నిరాకరించడంతో పాటు ప్రజెంటర్లను వేచి చూసేలా చేయడంపై సూర్యకుమార్ (Surya Kumar) యాదవ్ స్పందించారు. ప్రెజెంటేషన్ వేడుకలో భారత బృందం ట్రోఫీని తీసుకోవడానికి వేచి ఉందని చెప్పిన సూర్య.. వారు ఎవరినీ అనవసరంగా వేచి ఉండమని తాము కోరలేదని స్పష్టం చేశాడు. “ట్రోఫీ కోసం మేము గంటకు పైగా అక్కడ వేచి ఉన్నాం. మేము డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వెళ్లలేదు” అని సూర్య వివరించాడు. “స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నేను చాలా గర్వంగా ఉన్నాను. పాకిస్తాన్‌పై గెలవడంతో దేశ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలను అలరించడానికే మేము క్రికెట్ ఆడుతున్నాం. పాకిస్తాన్‌పై విజయంతో ప్రజల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడంపై చాలా సంతోషంగా ఉన్నానని” తెలిపారు.