అక్షరటుడే, భీమ్‌గల్: ICDS | భీమ్‌గల్ ఐసీడీఎస్ (Bheemgal ICDS) పరిధిలోని ఓ అధికారిణి నిర్వాకం విమర్శలకు తావిస్తోంది. ఆమె ఆడిందే ఆటగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. భీమ్‌గల్ ప్రాజెక్టు పరిధిలో 283 అంగన్వాడీ కేంద్రాలున్నాయి (Anganwadi centers). 11 సెక్టార్లు ఉన్నాయి. కాగా.. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లను ఓ అధికారిణి ముప్పుతిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రాల తనిఖీకి వెళ్లినప్పుడు అక్కడి లొసుగులను ఆసరాగా చేసుకుని, వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కేంద్రాలను (Anganwadi centers) నిరంతరం పర్యవేక్షిస్తూ.. లబ్ధిదారులకు సరైన పోషకాహారం అందేలా చూడాల్సిన ఉద్యోగే ఇలా.. వారి లొసుగులనే ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడడం గమనార్హం.
ICDS | రాచ మర్యాదలు చేయాల్సిందే..
సదరు అధికారిణి ఏదైనా అంగన్వాడీ కేంద్రానికి వెళితే.. ఆమెకు టీచర్లు, ఆయాలు (Anganwadi teachers and nurses) రాచ మర్యాదలు చేయాల్సిందేనట. లేదంటే పనితీరు బాలేదని, విద్యార్థులు లేరని, పౌష్టికాహారం అందించడం లేదని, ఇలా ఏదో ఒక సాకుతో వారిని బెదిరింపులకు గురి చేస్తుందని తెలుస్తోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వచ్చే పప్పు, గుడ్లు, ఆయిల్ ప్యాకెట్లు ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఆమెకు ఇవ్వాల్సిందేనట. లేదంటే, ఏదో సాకుతో వేధింపులకు గురి చేస్తుంది. దీంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుని టీచర్లు, ఆయాలు మిన్నకుండిపోతున్నారని సమాచారం.
ICDS | తాలింపు, పోపు వేయించాల్సిందే..
అంగన్వాడీ కేంద్రం విజిట్‌కు వచ్చే సదరు అధికారిణి కేంద్రానికి వచ్చిన సమయంలో మక్క చిప్స్‌తో తాళింపు, పోపు వేసి ఇవ్వాలట. ఎంతో దూరం నుంచి వస్తే కనీసం ఇది కూడా ఇవ్వరా.. అని ఆర్డర్ వేస్తుందట. అంతేగాక, రాకపోకలకు కారు కూడా ఏర్పాటు చేయాలట. ఇటీవల తనిఖీ చేసిన కేంద్రాల్లో నుంచి గుడ్లు, పప్పులు, నూనెలు గుట్టుగా తీసుకెళ్లినట్లు సమాచారం. ఉన్నతాధికారులు సదరు సూపర్‌వైజర్ లీలలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ICDS | దృష్టికి రాలేదు..
– స్వర్ణలత, సీడీపీవో, భీమ్‌గల్
అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలకు వెళ్తున్న పర్యవేక్షకురాలు ఆయా కేంద్రాల టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. ఎవరైనా టీచర్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకుంటాం.