అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Immersion | వినాయక చవితి (Vinayaka Chavithi) ఉత్సవాలను హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి వీధిలో గణపతి మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
నగరంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఖైరతాబాద్ గణేశుడి (Khairatabad Ganesh) దర్శనానికి నిత్యం భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. మూడు క్యూలైన్లలో బారులు తీరారు. వారికి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు, అధికారులు చర్యలు చేపట్టారు.
Ganesh Immersion | నిమజ్జనంపై ప్రకటన
హైదరాబాద్ (Hyderabad)లో వినాయక విగ్రహాలను ఐదు రోజుల నుంచే నిమజ్జనం చేస్తారు. కొంత మంది ఐదు రోజులకు, 9, 11 రోజులకు నిమజ్జనం చేస్తారు. అయితే భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ్ సమితి మాత్రం సెప్టెంబర్ 6న (11 రోజులకు) నిమజ్జనం చేస్తామని గతంలోనే ప్రకటించింది. అయితే 7న పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఉంది. దీంతో ఈ ఏడాది తొమ్మిది రోజులకు నిమజ్జనం చేయాలని కొంత మంది పండితులు చెప్పారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనంపై నిర్వాహకులు ప్రకటన చేశారు. సెప్టెంబర్ 6నే నిమజ్జనం చేస్తామని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన శోభాయాత్ర కనుల పండువగా సాగుతుంది. బడా గణేశుడిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు సైతం అప్రమత్తంగా ఉంటారు. ఈ మేరకు ముందుగానే రూట్‌మ్యాప్ విడుదల చేసి, ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో నిమజ్జనంపై నిర్వాహకులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.
Ganesh Immersion | యువకుల తిప్పలు
చాలా గ్రామాల్లో వినాయక నిమజ్జనం 11 రోజులకు చేస్తారు. దీంతో మండపాల నిర్వాహకులు సౌండ్ సిస్టం 11 రోజులకు బుక్ చేసుకున్నారు. అయితే చంద్రగ్రహణం (Lunar eclipse) నేపథ్యంలో 9 రోజులకే నిమజ్జనం చేయాలని పలు చోట్ల గ్రామపెద్దలు సూచిస్తున్నారు. దీంతో యువకులు ఇబ్బందులు పడుతున్నారు. 11 రోజుల కోసం డీజే, డెకరేషన్ బుక్ చేశామని.. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామని చెబుతున్నారు. గ్రామపెద్దల నిర్ణయం మేరకు 9 రోజులకే నిమజ్జనం చేయడానికి కొంతమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు.