అక్షరటుడే, వెబ్డెస్క్ : Dhana Trayodashi | ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ఈ పర్వదినం వస్తోంది.
ధన త్రయోదశి అనేది దీపావళి పండుగకు (Diwali Festival) ముందు వచ్చే ప్రత్యేకమైన తిథి. మరోరకంగా చెప్పాలంటే ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి. లక్ష్మీదేవి (Lakshmi Devi) పాల కడలి నుంచి ఉద్భవించింది ఈ రోజేనని భక్తులు నమ్ముతారు. క్షీరసాగర మథనంలో అమృత కలశాన్ని చేతబట్టుకొని ధన్వంతరి(Dhanvantari) అవతరించింది కూడా ఈ రోజేనన్నది భక్తుల విశ్వాసం. అందుకే ఈరోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని, ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరిని పూజిస్తారు. భక్తులు సంపద, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవితోపాటు కుబేరుడిని పూజిస్తారు. ఆర్యోగం కోసం ధన్వంతరిని ప్రార్థిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ఆరోగ్య సిద్ధి కోసం, అపమృత్యు దోషాల నివారణ కోసం ఆ రోజున ఏ చేయాలన్న విషయం తెలుసుకుందాం..
Dhana Trayodashi | దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం..
ధన త్రయోదశి (Dhana Trayodashi)పర్వదినం సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించి, ఇంట్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇంటి గుమ్మాలు, కిటికీల వద్ద నెయ్యి దీపాలు వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి తగ్గిపోతుందంటున్నారు. ఇంట్లో ఆగ్నేయ మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరమంటున్నారు.
Dhana Trayodashi | తులసి పూజ..
ధన త్రయోదశి రోజున ఉదయాన్నే తులసి కోట వద్ద నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందన్నది భక్తుల నమ్మకం. అలాగే లక్ష్మీదేవి ప్రసన్నం కోసం అమ్మవారికి తామర పూలమాల సమర్పించాలి.
Dhana Trayodashi | యమ దీపం.. దానం..
ధన త్రయోదశి రోజున అపమృత్యు దోష నివారణ కోసం తప్పనిసరిగా యమ దీపాన్ని (Yama Deepam) వెలిగించాలని వేదపండితులు సూచిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ఇంటి బయట దక్షిణ దిశవైపు ఒక మట్టి ప్రమిదలో నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మృత్యుదేవతైన యమధర్మరాజు (Yamadharmaraju)అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. యమ ధర్మరాజును ప్రసన్నం చేసుకోవడానికి దీపం దానం చేయాలని సూచిస్తారు. యమదీపాన్ని వెలిగిస్తే అనారోగ్య సమస్యలు రావని, ఏవైనా దోషాలున్నా తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం.
Dhana Trayodashi | శనిదోష నివారణకు..
ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాల నివారణకోసం ధన త్రయోదశి రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. అలాగే ఆర్థిక సమస్యలనుంచి ఉపశమనం కోసం లక్ష్మీదేవిని పూజించాలి.
Dhana Trayodashi | ఏం కొనాలంటే?
ధన త్రయోదశి రోజు పలు వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రధానంగా సంపదకు చిహ్నంగా భావించే బంగారం కొనుగోలు చేస్తారు. వెండి, రాగి పాత్రలూ కొనుగోలు చేస్తుంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురను సైతం కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం తొలగిపోతాయని నమ్ముతారు. కొత్తిమీర, ధనియాలు, ఉప్పు వంటివి కొనడాన్ని కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. వీటిని కొనడం వల్ల ఇంట్లో సిరి సంపదలకు లోటుండదని నమ్ముతారు.
Dhana Trayodashi | ఏం కొనకూడదంటే?
ధన త్రయోదశి రోజున గాజు పాత్రలను కొనకూడదని చెబుతారు. గాజు రాహువుకు సంబంధించినది కాబట్టి ఆ రోజు గాజు పాత్రలు కొనకూడదంటారు. అల్యూమినియంతోపాటు పదునైన వస్తువులు, నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేయవద్దని పెద్దలు సూచిస్తారు.