అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Speaker | తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళన కనిపిస్తోంది. పదవులు ఉంటాయో పోతాయో తెలియక, తమ భవితవ్యమేమిటో అర్థం కాని పరిస్థితుల్లో వారిలో కలవరం మొదలైంది. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మూడు నెలల్లో తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల (Supreme Court order) నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సభాపతి తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తమ రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడుతుందన్న భయాందోళన కనిపిస్తోంది. వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో కింకర్తవ్యం ఏమిటన్న ప్రశ్న వెంటాడుతున్నది.
Assembly Speaker | ఉప ఎన్నికలు తప్పవా?.. పది మంది ఫిరాయింపు..
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) అనూహ్యంగా ఓటమి పాలైంది. పదేళ్ల పాలనపై వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యేల అరాచకాలు, అవినీతి తదితర అంశాలు గులాబీ పార్టీని దారుణంగా దెబ్బ తీశాయి. అదే సమయంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తిరిగి పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు హస్తం గూటికి చేరారు. ఒకరి తర్వాత మరొకరు మొత్తం 10 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ (BRS party) స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. అయితే, దీనిపై సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Assembly Speaker | సుప్రీం సంచలన తీర్పు..
స్పీకర్ ఎంతకీ తేల్చకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును (High Court) ఆశ్రయించింది. స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పునివ్వగా, డివిజన్ బెంచ్ మాత్రం ఆ తీర్పును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్ళారని, వారిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేసింది. మరోవైపు, ఫిరాయింపులపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Yeleti Maheshwar Reddy) మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన్న సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. రాజకీయ ఫిరాయింపులను అరికట్టకపోతే.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని పేర్కొంది. స్పీకర్ కాలయాపన చేస్తుండడాన్ని తప్పుబట్టిన కోర్టు.. ఫిరాయింపులపై వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. విచారణ పేరిట కాలయాపన చేయడమంటే ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్ అన్నట్లవుతుందని సీజేఐ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Assembly Speaker | స్పీకర్ నిర్ణయంపైనే ఆధారం..
సుప్రీంకోర్టు ఆదేశాల (Supreme Court orders) నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ వైపు మళ్లింది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా.. లేక సుప్రీంకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ విస్తృత ధర్మాసనానికి వెళ్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు సభాపతి స్పందిస్తూ.. న్యాయవ్యవస్థ తీరుపై కాసింత అసంతృప్తిగా మాట్లాడారు. గతంలో న్యాయ వ్యవస్థపై మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (former Vice President Jagdeep Dhankhar) చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని ఆయన చెప్పడం గమనార్హం.
Assembly Speaker | ఉప ఎన్నికలు తప్పవా?
స్పీకర్ నిర్ణయంపైనే పది మంది భవితవ్యం ఆధారపడి ఉంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ (ఖైరతాబాద్), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), కాలె యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), డాక్టర్ సంజయ్ (జగిత్యాల), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ) కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దానం నాగేందర్ అయితే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ఏకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. వారి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వారిపై అనర్హత వేటు వేస్తే మాత్రం ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఈ నేపథ్యంలో తమ భవితవ్యమేమిటో అర్థం కాక ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో భయాందోళన నెలకొంది.