అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు ఎందుకు చోటు కల్పించలేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని విమర్శించారు. సోమవారం ఎక్స్‌లో ఓ పోస్టు చేసిన కవిత.. సమాచార చట్టం కమిషన్‌లో బీసీ(BC)లు, ఎస్టీ(ST)లకు ప్రాతినిధ్యం లేదనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్ (Chief Commissioner), నలుగురు కమిషనర్‌లలో ఒక్కరు కూడా ఎస్టీ, బీసీలు లేరని తెలిపారు.
మరో ముగ్గురు కమిషనర్ల నియామకం కోసం రూపొందించిన ప్రతిపాదనల్లోనూ బీసీలు, ఎస్టీలకు ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోందని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో ఈ చర్యలే రూడీ చేస్తున్నాయని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం పెండింగ్‌లో ఉన్న మూడు కమిషనర్ పోస్టులను బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.
MLC Kavitha | తెలంగాణ ఆర్టీఐ కమిషన్
రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కమిషన్ సభ్యులను ఇటీవలే నియమించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సీనియర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని (Chandrasekhar Reddy) ఛైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం.. కమిషనర్లుగా పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమించింది. వీరిలో ఇద్దరు ఓసీలతో పాటు ఎస్సీ, మైనార్టీ, వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయితే, బీసీ, ఎస్టీలకు కమిషన్‌లో ప్రాతినిధ్యం లభించలేదు. మరో మూడు కమిషనర్ పోస్టులు (Commissioner Posts) ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం ప్రభుత్వం కొందరి పేర్లను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలోనే కవిత స్పందిస్తూ.. బీసీ, ఎస్టీలకు కమిషనర్లుగా అవకాశం కల్పించలేదని విమర్శించారు. త్వరలో నియమించనున్న కమిషనర్లలోనైనా ఆయా వర్గాలకు ఛాన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
