అక్షరటుడే, భీమ్గల్ : MLA Prashanth Reddy | ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన ‘తులం బంగారం’ హామీని తక్షణమే నెరవేర్చాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం బాల్కొండ నియోజకవర్గానికి (Balkonda Constituency) చెందిన సుమారు 429 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
MLA Prashanth Reddy | ఆడబిడ్డ భారం కాకూడదనే..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) మేనమామ కట్నంలా రూ.1,00,116 అందించే పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి రెండేళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
MLA Prashanth Reddy | హామీలు అమలు చేసే వరకు పోరాటం
మహిళలకు రూ.2,500 జీవన భృతి, రూ.4,000 పెన్షన్, తులం బంగారం వంటి హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని వేముల ఆరోపించారు. అసెంబ్లీ (Assembly) వేదికగా తాము ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. పాత, కొత్త లబ్ధిదారులందరికీ తులం బంగారం ఇవ్వాల్సిందేనని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన అసెంబ్లీలోనూ, క్షేత్రస్థాయిలోనూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహిళలు ప్రభుత్వ వైఖరిని గమనించాలని, సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.