Homeబిజినెస్​Tata Group | ‘టాటా’లకేమయ్యింది?.. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చిన స్టాక్స్‌

Tata Group | ‘టాటా’లకేమయ్యింది?.. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చిన స్టాక్స్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tata Group | టాటా.. నమ్మకానికి మారుపేరు.. టాటా ఉత్పత్తులు నాణ్యమైనవన్న నమ్మకం కస్టమర్లది.. టాటా షేర్లు మంచి రిటర్న్స్‌ ఇస్తాయన్న నమ్మకం ఇన్వెస్టర్లది. అయితే కొంతకాలంగా టాటా గ్రూప్‌ (Tata Group) షేర్లకు కష్టకాలం నడుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో టాటా గ్రూప్‌ మార్కెట్‌ వాల్యూ (Market Value) పడిపోతోంది. ఒకప్పుడు ఇన్వెస్టర్లకు సంపద సృష్టించిన షేర్లు.. ఇప్పుడు రాబడులను అందించకపోగా నష్టాలను మిగులుస్తున్నాయి. గ్రూప్‌లో ర్యాలీస్‌ (Rallis), టాటా కన్జూమర్‌, టాటా స్టీల్‌, బెనారస్‌ హోటల్స్‌, టైటాన్‌, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ మినహా మిగిలిన మిగిలిన స్టాక్స్‌ అన్నీ నష్టాలను అందించాయి. తేజస్‌ నెట్‌వర్క్స్‌, నెల్కో, టీసీఎస్‌, టీఆర్‌ఎఫ్‌ భారీగా నష్టపోయాయి.

Tata Group | 15 శాతం క్షీణించిన మార్కెట్‌ క్యాప్‌

2025 క్యాలెండర్‌ ఇయర్‌లో టాటా గ్రూప్‌ స్టాక్స్‌ అండర్‌ పర్ఫార్మ్‌ చేస్తుండడంతో గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ (Market Cap) 15 శాతానికిపైగా క్షీణించింది. 2024 ముగింపులో రూ. 31.10 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్‌ క్యాప్‌.. ప్రస్తుతం రూ. 26.56 లక్షల కోట్లకు పడిపోయింది. 2023లో 33 శాతం, 2024లో దాదాపు 12 శాతం పెరగడం గమనార్హం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(TCS) ఒక్కటే రూ. 3.91 లక్షల కోట్లకుపైగా మార్కెట్‌ విలువను కోల్పోవడం గమనార్హం. టాటా మోటార్స్‌, ఇండియన్‌ హోటల్స్‌, వోల్టాస్‌ ఒక్కొక్కటి రూ. 14 వేల కోట్లకుపైగా నష్టపోయాయి. తేజస్‌ నెట్‌వర్క్స్‌(Tejas Networks) మార్కెట్‌ విలువ రూ. 10 వేల కోట్లకు పైగా తగ్గింది. టాటా టెక్నాలజీస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 8,400 కోట్లు, టాటా ఎలెక్సీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 6 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. గ్రూప్‌ కంపెనీలలో టైటాన్‌(Titan) కంపెనీ, టాటా స్టీల్‌ మాత్రం మంచి పనితీరును కనబరిచాయి. ఒక్కో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 27 వేల కోట్లకుపైగా పెరగడం గమనార్హం. టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 17 వేల కోట్లకు పైగా పెరిగింది.

Tata Group | ఆర్థిక అనిశ్చితులతో నష్టాలు..

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఐటీ(IT) రంగం మందగమనంలో సాగుతోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. ట్రంప్‌ సుంకాల ప్రభావం (Trump Tariffs Effect) కూడా కనిపిస్తోంది. దీంతో టాటా గ్రూప్‌ కంపెనీలలో అత్యధికం ఎదురుగాలులను ఎదుర్కొంటున్నాయి. దీంతో మార్కెట్‌ లీడర్లుగా ఉన్న కంపెనీలు సైతం మదుపరులకు నష్టాలను మిగులుస్తున్నాయి.

Tata Group | గత రెండేళ్లలో అద్భుత రాబడులు..

2023, 2024 క్యాలెండర్‌ ఇయర్స్‌లో టాటా గ్రూప్‌ షేర్లు అద్భుతంగా రాణించాయి. ఈ గ్రూప్‌లోని 12 కంపెనీలు 50 నుంచి 300 శాతం రాబడులు ఇచ్చాయి. ట్రెంట్‌(Trent) షేరు ధర 300 శాతానికిపైగా పెరగ్గా.. బెనారస్‌ హోటల్స్‌ 240 శాతానికిపైగా లాభాలనిచ్చింది. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ 228 శాతం, ఇండియన్‌ హోటల్స్‌ 150 శాతం, ఆటోమొబైల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గోవా 130 శాతం పెరిగాయి. ఆర్ట్‌సన్‌ 120 శాతం, టీఆర్‌ఎఫ్‌ 92 శాతం లాభపడ్డాయి. ఓరియంటల్‌ హోటల్స్‌, టాటా పవర్‌(Tata power) 90 శాతం లాభాలను అందించాయి. టాటా మోటార్స్‌ 77 శాతం, వోల్టాస్‌ 70 శాతం, ర్యాలీస్‌ ఇండియా 55 శాతం పెరిగాయి. టాటా స్టీల్‌, టైటాన్‌ కంపెనీలు దాదాపు 40 శాతం వరకు రాబడులు ఇచ్చాయి. టీటీఎంఎల్‌, టాటా ఎలెక్సీ, టీసీఎస్‌ మూడేళ్లుగా నెగెటివ్‌ రిటర్న్స్‌ మాత్రమే అందిస్తున్నాయి.

గత మూడేళ్లలో టాటా గ్రూప్‌లోని కంపెనీలు అందించిన రాబడుల వివరాలిలా(శాతంలో) ఉన్నాయి.