అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana | పార్టీ ఫిరాయింపుల పర్వం ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చకు దారి తీసింది. రాజకీయంగా, నైతికంగా దిగజారి పోతున్న నేతల తీరును ఎత్తి చూపుతోంది. అభివృద్ధి కోసమని అప్పట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట మార్చడం విమర్శలకు చర్చకు తావిచ్చింది.
తాము పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి(Constituency Development) కోసమే ముఖ్యమంత్రిని కలిశామని చెబుతుండడం అసలు సిసలైన స్వార్థ రాజకీయాలకు ఉదాహారణగా నిలిచింది. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలే కాదు.. చాలా మంది రాజకీయ నేతలు నైతికంగా ఎప్పుడో దిగజారి పోయారు. నాయకుడిగా తీర్చిదిద్ది, బీఫామ్ ఇచ్చిన పార్టీని మోసగించి, ఓట్లేసిన గెలిపించిన ప్రజలను వంచించి పాతాళానికి పడిపోయారు. కేవలం అధికారమే పరమావధిగా నీతి నిజాయితీని, విలువలను వదిలేసి దుష్ట సంప్రదాయాలకు తెర లేపారు. పదవుల కోసం దిగజారిన నాయకులను చూసి జనం ఛీదరించుకుంటున్నారు. వీళ్లకా తాము ఓట్లేసి గెలిపించిందని అసహ్యించుకుంటున్నారు.
Telangana | పిచ్చోళ్లు నాయకులా.. జనాలా?
రాష్ట్రంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ప్రజలంతా చూశారు, చూస్తున్నారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయా శాసనసభ్యులు మీడియా ముఖంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు(Supreme Court) కన్నెర్ర చేయడం, అనర్హత కత్తి వేలాడుతుండడంతో ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట మార్చారు. పదవిని కాపాడుకునేందుకు నీతిమాలిన రీతిలో వ్యవహరిస్తున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నామని నిస్సిగ్గుగా చెబుతున్నారు. నెలల వ్యవధిలోనే మాట మార్చిన నాయకులు ఎవర్ని పిచ్చోళ్లను చేస్తున్నట్లు.. ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల్నా..? చట్టబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌నా..? లేక అత్యున్నత న్యాయస్థానాన్నా?
Telangana | ఇదే మొదలు కాదు.. చివర కాదు..
పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కొత్త వచ్చింది.. ఇవాళ్టితో ముగిసేదీ కాదు. దశాబ్దాల కాలం నాటి నుంచి కొనసాగుతున్నదే. అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నదే. ఏ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫిరాయింపులు జరిగాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి టీఆర్ఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. అంతెందుకు, ఇప్పుడు ఫిరాయింపులపై పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న బీఆర్ఎస్ గతంలో ఎంతో మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేరుకున్నది. ప్రజా తీర్పును కాలరాస్తూ శాసనసభలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ, చివరకు కమ్యూనిస్టు పార్టీల ఉనికే లేకుండా చేసింది. వేరే పార్టీ గుర్తులపై గెలిచిన వారిని మంత్రులుగా చేసిన ఘనతను కూడా దక్కించుకుంది. ఇప్పుడేమో ప్రతిపక్షంలోకి రాగానే ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడుతూ జనాల్ని పిచ్చోళ్లను చేస్తోంది. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ(Congress Party) గతంలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా గళమెత్తింది. ఇక, బీజేపీ కూడా తక్కువేమీ తినలేదు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు, ప్రభుత్వాల ఉనికే లేకుండా చేసేసింది. అందుకు పక్కనున్న మహారాష్ట్ర రాజకీయాలే మంచి ఉదాహారణ. స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్న పార్టీలు ఎప్పుడో నైతిక విలువలను వదిలేశాయి. ద్వంద విధానాలను అవలంభిస్తూ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి.
Telangana | ఏం జరుగుతుందో?
పది మంది ఎమ్మెల్యేలు(BRS MLA) పార్టీ మారింది నిజం.. కండువాలు కప్పుకున్నదీ నిజం. తాము కాంగ్రెస్ అనుబంధంగా పని చేస్తున్నామని చెప్పుకున్నదీ వాస్తవం. ఇప్పుడు మాట మార్చింది కూడా వాస్తవమే. అయితే, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన శాసన సభాపతి ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. గడువు సమీపిస్తున్న తరుణంలో సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి కట్టుబడి ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? లేక పార్టీ మారలేదని శాసనసభ్యులు ఇచ్చిన సమాధానం మేరకు నిర్ణయం తీసుకుంటారా? అన్నది కాలమే నిర్ణయించనుంది.