అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Election | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు తమ తమ గెలుపు వ్యూహాలను సిద్ధం చేస్తుండగా, బీజేపీ మాత్రం ఈసారి గ్రామీణ రాజకీయాల్లో సత్తా చాటాలని సంకల్పించింది.
ఇప్పటివరకు అర్బన్ పార్టీగా పేరుగాంచిన బీజేపీ(BJP), గ్రామాలలోనే మా నిజమైన బలం ఉందని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ(Telangana) బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి గెలిచినవారేనని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బలహీనంగా ఉన్నా, ఇప్పుడు బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఓటు బ్యాంక్ ఉందని, రూరల్ ఏరియాల్లో 38 శాతం ఓట్లు తమవే అంటూ ధీమాగా ఉంది.
Local Body Election | పార్టీ క్యాడర్ పై ప్రశ్నలు
ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీకి గ్రామీణ స్థాయిలో బలమైన క్యాడర్, క్రియాశీల నాయకులు ఇప్పటికీ కొరవడే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలోకి కొత్తగా చేరుతున్న నేతలు ఆశించిన స్థాయిలో లేరు. రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసలు పెరుగుతాయని భావించినా, ముఖ్యంగా జిల్లా స్థాయిలో మార్పులు అంతగా కనిపించకపోవడం పార్టీ ముందున్న సవాలుగా మారింది. బీజేపీ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే రెండు దశలలో ఎన్నికల వ్యూహాలపై వర్క్‌షాపులు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇచ్చిన నిధులతోనే గ్రామీణాభివృద్ధి జరుగుతోందన్న సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఈసారి అవకాశమిస్తే గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం, అవినీతికి తావులేని పాలన అందిస్తామని ప్రచారం చేస్తోంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party)ల నుంచి టికెట్ దక్కని అభ్యర్థులను బీజేపీలోకి ఆహ్వానించి బరిలోకి దింపే వ్యూహాన్ని కమలం పార్టీ అవలంభిస్తోంది. అంతేకాదు, ఎమ్మెల్యే టికెట్ ఆశించే నేతలను కూడా ఈసారి జెడ్పీటీసీ లుగా బరిలోకి దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఈసారి బీజేపీ లక్ష్యం కేవలం కొన్ని స్థానాల విజయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ నుండి జెడ్పీటీసీ వరకూ సంపూర్ణ స్థాయిలో పోటీ చేసి, తాను ప్రబల ప్రత్యామ్నాయంగా ఎదగడమే. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) తిరిగి అధికారంలోకి వచ్చినా, బీజేపీ మాత్రం తాను తలపడటానికి సిద్ధమని స్పష్టంగా చెబుతోంది. తెలంగాణలో బీజేపీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election)ను కేవలం ఓ ఎన్నికగా కాకుండా, తమ భవిష్యత్తు కోసం పరీక్షగా భావిస్తోంది. ప్రజలు ఈసారి కమలం పార్టీకి ఊహించని ఫలితాన్ని ఇస్తారన్న నమ్మకంతో బీజేపీ ముందుకు సాగుతోంది.