అక్షరటుడే, వెబ్డెస్క్ : Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు (Nizamabad Police) హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రత్యేకించి పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు (Raids) జరిపిన విషయం విధితమే.
సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, అప్పు తాలుకు పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే బడా వడ్డీ వ్యాపారుల పట్ల పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
Moneylenders | రూ.కోట్లలో దందా
నిజామాబాద్ నగరం కేంద్రంగా పలువురు రూ.కోట్లలో వడ్డీ దందా నిర్వహిస్తున్నారు. నెలకు 3 నుంచి 5 శాతం వడ్డీ తీసుకోవడమే కాకుండా.. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఆయా వ్యాపారులకు ఎలాంటి అనుమతులు లేవు. చిట్ఫండ్ (Chit Fund) ముసుగులో దర్జాగా ఫైనాన్స్ దందా సాగిస్తున్నారు.
ఉదాహరణకు నగరంలోని ప్రముఖ స్టార్ హోటల్, షాపింగ్ మాల్ యజమాని రూ.కోట్లలో వడ్డీ దందా నిర్వహిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పొలిటికల్ లీడర్లకు ఈ వ్యాపారి పెద్ద ఎత్తున అప్పులుగా ఇచ్చాడు. ఆస్తి తాలుకా పత్రాలు నేరుగా తనతో పాటు తన బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకొని రూ.కోట్లలో వడ్డీ దందా చేస్తున్నాడు. అయినా పోలీసులు సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కమిషనరేట్లో ఇప్పటి వరకు రెండు దఫాలుగా సోదాలు నిర్వహించినప్పటికీ.. ఆ జాబితాలో వ్యాపారి పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Moneylenders | కేసులు నమోదైనా..
ఓ కూల్డ్రింక్స్ డీలర్ యజమాని, రియల్ ఎస్టేట్ (Real estate) వ్యాపారి కూడా పెద్ద మొత్తంలో వడ్డీ దందా నడుపుతున్నారు. వైద్యుడు, మరో ఇద్దరితో కలిసి సదరు వ్యాపారి గతంలో ఓ వెంచర్ నిర్వాహకులకు రూ.కోట్లను వడ్డీ కింద ఇచ్చాడు. ఈ వ్యవహరం వివాదంగా మారి పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఈ వడ్డీ వ్యాపారి మార్కెట్లో తన దందాను దర్జాగా సాగిస్తున్నాడు. అయినా ఇతగాడిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు.
ఓ పార్టీకి చెందిన నేత సైతం పెద్ద మొత్తంలో వడ్డీ దందా నిర్వహిస్తున్నాడు. తన బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకొని మార్కెట్లో వడ్డీ దందా కొనసాగిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసినా తనిఖీలు చేసేందుకు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఓ పక్కా వడ్డీ దందా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పోలీసులు మరోపక్కా బడా వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం గమనార్హం.