అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Market Yard | అకాల వర్షాలు అన్నదాతలను హడలెత్తిస్తున్నాయి. నగరంలో (Nizamabad City) సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా మార్కెట్‌యార్డు (Market Yard)లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది. ప్రభుత్వం రైతుల నుంచి సకాలంలో వడ్లు కొనకపోవడంతో వారు భారీగా నష్టపోయారు.
Nizamabad Market Yard | వెయ్యి క్వింటాళ్లకు పైగా..
సోమవారం రాత్రి కురిసిన వర్షానికి సుమారు 1000 క్వింటాలకు పైగా ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్(Makloor), నందిపేట్(Nandipet), నవీపేట్(Navipet) మండలాల్లోని పలు గ్రామాల నుంచి రైతులు 15 రోజుల క్రితమే ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తరలించారు. తగినన్ని లారీలు, హామాలీలు అందుబాటులో లేకపోవడం వల్లే ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
Nizamabad Market Yard | తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సిందే..
నిజామాబాద్ మండలంలోని ముబారక్ నగర్(Mubarak Nagar) గ్రామానికి చెందిన శ్రీనివాస్ పది రోజుల క్రితం వడ్లను యార్డుకు తరలించగా అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అదే గ్రామానికి చెందిన రాజు అనే రైతుకు చెందిన 20 బస్తాలు, దుబ్బ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతు 20 బస్తాలు, రాములుకు చెందిన 80 బస్తాలు వర్షానికి తడిసాయని వాపోయారు. తడిచిన ధాన్యాన్ని కూడా సకాలంలో మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.