అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా తనదైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసిన భారత జట్టు 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175), యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి (43), ధ్రువ్ జురెల్ (44), కేఎల్ రాహుల్ (38) మంచి మద్దతు లభించింది. టీమిండియా(Team India) ఓవర్‌నైట్ స్కోరు 318/2తో రెండో రోజు ఆటను ప్రారంభించింది . ఇన్నింగ్స్ మొదలైన రెండో ఓవర్‌లోనే అనవసర పరుగుకు ప్రయత్నించి యశస్వి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. డబుల్ సెంచరీకి 25 పరుగుల ముందు యశస్వి వెనుదిరిగాడు. సహచరుడు గిల్‌పై అసహనం వ్యక్తం చేస్తూ మైదానం విడిచిన దృశ్యం అభిమానులను బాధించింది.
Team India | ఇండియా జోరు..
ఇక తన స్టైల్‌లో ఆడి, 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన గిల్ (Shubhman Gill), తన స్కోరును 129* వరకు తీసుకెళ్లాడు. లూజ్ డెలివరీస్‌ను బౌండరీలుగా మలిచిన గిల్, మిగతా వాటిని జాగ్రత్తగా ఆడాడు. కెప్టెన్ అయినప్పటి నుండి గిల్ ఆడిన ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో అతని బ్యాట్ నుండి ఆరు సెంచరీలు రావడం విశేషం. వాటిలో నాలుగు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ కూడా ఉన్నాయి. విండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్ (3/98) సత్తాచాటాడు. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ తీశాడు. మిగతా బౌలర్లంతా భారత బ్యాటర్ల దెబ్బకు నిరుత్సాహంగా కనిపించారు.
ఇక వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా, రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షై హోప్ (31 నాటౌట్), టెవిన్ (14 నాటౌట్) ఉన్నారు. భారత బౌలర్స్‌లో జడేజా (Jadeja) తన స్పిన్‌తో విణికిస్తున్నాడు. విండీస్ కోల్పోయిన నాలుగు వికెట్స్‌లో జడేజా మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ ఒక వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (Sai Sudharsan) అద్భుతమైన క్యాచ్ పట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతను పట్టిన స్పాంటేనియస్ క్యాచ్ అభిమానులతో పాటు కామెంటేటర్లను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చోటు చేసుకుంది. జాన్ క్యాంప్‌బెల్, జడేజా వేసిన లెంగ్త్ బాల్‌ను బలంగా స్వీప్ చేశాడు. బంతి నేరుగా షార్ట్ లెగ్‌లో ఉన్న సుదర్శన్ వైపు వచ్చింది. ఆ సమయంలో సుదర్శన్ కాస్త ముందుకు వంగి, బంతి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతి అతని చేతికి తగిలి ఆశ్చర్యకరంగా అతని చేతుల్లోనే నిలిచిపోయింది. ఈ క్యాచ్‌తో బ్యాటర్ క్యాంప్‌బెల్ షాక్ అయి పెవీలియన్ బాట పట్టాడు.