అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | నదులు, నాలాలను కబ్జా చేస్తే తాటా తీస్తామని సీఎం హెచ్చరించారు. చెరువులను కబ్జా నుంచి విడిపించడం, మూసీ నది (Musi River) ప్రక్షాళన తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
నగరంలో అంబర్‌పేటలో గల బతుకమ్మ కుంట (Bathukamma Kunta)ను హైడ్రా (Hydraa) పునర్నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చెరువును ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం ఇచ్చారు. బతుకమ్మకుంటలో మొదటి బతుకమ్మను ఆయన వదిలారు. అనంతరం గంగమ్మకు చీర, సారెను సమర్పించారు. అంబర్‌పేటలో నిర్మాణం పూర్తయిన 6 ఎస్టీపీలను ప్రారంభించారు. అమృత్ 2.0 పథకం కింద ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలో నిర్మించనున్న 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.
CM Revanth Reddy | పేదలకు న్యాయం చేస్తాం
మూసీ నది పరీవాహక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ఎంతో మంది పేదలు నివసిస్తున్నారని చెప్పారు. వారికి అన్యాయం చేయమన్నారు. కరోనా తర్వాత పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. రోజుకు 2 సెంటీ మీటర్ల వర్షం కురిస్తే తట్టుకునేలా నగరంలో కాలువలు, నాలాలు నిర్మించారని చెప్పారు. కానీ ఇటీవల వాతావరణంలో మార్పులు వచ్చి గంటలో 20 సెంటీ మీటర్ల వర్షం కురుస్తుందని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. దీంతో వరదల నుంచి నగరాన్ని కాపాడాటానికి తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చుదిద్దుతామన్నారు.
CM Revanth Reddy | పేదల వైపే హైడ్రా
చెత్తకుప్పలా ఉన్న బతుకమ్మ కుంటను బాగు చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇలా నగరంలోని అనేక కుంటలు, చెరువులను బాగు చేస్తామన్నారు. హైడ్రా పేదల వైపే ఉంటుందని స్పష్టం చేశారు. బతుకమ్మ కుంటలో కొంత మంది పేదలు ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు. వాటిని కూల్చకుండా కబ్జాదారుల నుంచి మాత్రమే భూమిని న్యాయపరంగా స్వాధీనం చేసుకొని చెరువును అభివృద్ధి చేశామన్నారు.