అక్షరటుడే, వెబ్డెస్క్ : AP Assembly | ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) హెచ్చరించారు. వైసీపీ (YCP) ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఎమ్మెల్సీలు శాసన మండలి చర్చలో పాల్గొంటున్నా.. ఎమ్మెల్యేలు మాత్రం సభ ముఖం చూడటం లేదు. వారి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Assembly | జీతాలు తీసుకుంటున్నారు
వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ తెలిపారు. జగన్ (YS Jagan) మినహా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతీ నెల జీతాలు తీసుకుంటున్నారని చెప్పారు. జీతం తీసుకుని పని చేయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలపై రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తామని తెలిపారు.
కాగా తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని గతంలో వైసీపీ అధినేత జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు రాకపోవడంతో ఇవ్వడం లేదని స్పీకర్ గతంలోనే తెలిపారు. అయినా వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
