అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | బయో టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ (Hyderabad) ఏఐజీ హాస్పిటల్స్ (AIG Hospitals) ఆధ్వర్యంలో జరిగిన ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025లో ఆదివారం ఆయన పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ బయోడిజైన్ విధానం ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణలకు తమ ప్రభుత్వం మద్దతునిస్తుందని చెప్పారు. మాన్యుఫాక్చరింగ్ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడం శుభ సూచకమని అన్నారు. దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి స్వదేశీ ఆవిష్కరణలు అవసరమని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Reddy | వాటితో అనుసంధానం చేస్తాం
ఆవిష్కరణల (Innovations) కోసం విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, కార్పొరేట్ భాగస్వాములతో అనుసంధానం చేస్తామని సీఎం అన్నారు. చాలా ఏళ్లుగా మన మేదస్సు ఇతర దేశాల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మన ప్రతిభ పాటవాలు దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
CM Revanth Reddy | ఉన్నత స్థానంలో తెలంగాణ
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ (Telangana) దేశంలో ఉన్నత స్థానంలో ఉందని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, సర్జికల్ పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో గణనీయమైన పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు.
CM Revanth Reddy | అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్
వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కోసం సుల్తాన్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. అక్కడ 60కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు ఇప్పటికే పని చేస్తున్నాయన్నారు. సమ్మిట్‌లో ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, బయోడిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ ఛైర్మన్ డాక్టర్ రాజేశ్ కలపల, డాక్టర్ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు.