అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. మళ్లీ అణ్వాయుధ (Nuclear weapon) పరీక్షలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
రష్యా (Russia), చైనా (China) వంటి దేశాలు అణు సామర్థ్యాలను పెంచుకుంటున్న నేపథ్యంలో తాము కూడా అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక అణ్వాయుధాలు అమెరికాకు ఉన్నాయి. తన హయాంలోనే ఇది సాధించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇటీవల రష్యా, చైనా ఆయుధ సంపత్తిని పెంచుకుంటాయని చెప్పారు. ఆ దేశాలు త్వరలో అమెరికాతో సమానంగా అణ్వాయుధాలు సిద్ధం చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తాము మరిన్ని ఆయుధాలు తయారు చేయాలని నిర్ణయించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌కు ఆదేశాలు జారీ చేశానని ఆయన ప్రకటించారు.
Donald Trump | మళ్లీ ఆయుధ పోటీ..
ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ అగ్ర దేశాల మధ్య అణ్వాయుధ పోటీ నెలకొంటుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా ఇటీవల అణు సామర్థ్యాలను పెంపొందించడానికి చర్యలు చేపట్టింది. పాత ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలగడంతో పాటు అధునాతన అణు సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. రష్యా పోసిడాన్ అణు డ్రోన్ సబ్‌మెర్సిబుల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. చైనా సైతం అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ఈ క్రమంలో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump | ఇతర దేశాలపై ఆంక్షలు
ఇప్పటికే అమెరికా వద్ద భారీగా అణ్వాయుధాలు ఉన్నాయి. అయినా మళ్లీ పరీక్షలు చేపట్టాలని నిర్ణయించినట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే అదే సమయంలో తమ రక్షణ కోసం ఇతర దేశాలు అణు పరీక్షలు చేయాలని చూస్తే మాత్రం అమెరికా అడ్డు చెబుతుండటం గమనార్హం. ఇటీవల ఇరాన్‌లోని యూరేనియం ప్లాంట్లపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇరాన్ అణుశక్తి దేశంగా ఎదగకుండా అమెరికా అడ్డు పడుతోంది. అయితే పెద్ద దేశాలు భారీగా ఆయుధాలు కలిగి ఉండి, ఇతర దేశాలపై ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం అని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా అమెరికా ప్రయోగాలు చేపడితే.. ఇతర దేశాలు అదే మార్గంలో ప్రయాణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

