అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | నిజామాబాద్ (Nizamabad) నగరంలో ఇటీవల మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
నిజామాబాద్ నగరంలో ఇటీవల కానిస్టేబుల్ ప్రమోద్ (Constable Pramod) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ కేసులో నిందితుడైన రియాజ్‌ను అరెస్ట్ చేసి తీసుకు వస్తుండగా.. అతడు కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రమోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవంలో ప్రమోద్ గురించి సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వం అతని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.కోటికి పైగా ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు.
CM Revanth Reddy | ప్రథమ స్థానంలో తెలంగాణ
పోలీసులు అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టాల్సి వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదని పేర్కొన్నారు. పోలీసుల కృషితో శాంతి భద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.
CM Revanth Reddy | ఐదుగురు పోలీసుల మృతి
ఈ సంవత్సరం దేశంలో 191 మంది పోలీసులు వీరమరణం పొందారని సీఎం తెలిపారు. ఇందులో తెలంగాణ పోలీసులు (Telangana Police) ఐదుగురు ఉన్నారని చెప్పారు. పోలీసు అమరవీరుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. పోలీసు అమరవీరుల్లో కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వారికి రూ.25 లక్షలు, డీఎస్పీ నుంచి ఎస్‌పీ ర్యాంకు అధికారుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆపై ఉన్నతాధికారుల కుటుంబాలకు రూ.2 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు 200 గజాల స్థలాలు కేటాయిస్తామని, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
CM Revanth Reddy | మావోయిస్టులు లొంగిపోవాలి
మావోయిస్టులు లొంగిపోవాలని, సమాజంలో కలిసిపోవాలని సీఎం సూచించారు. దేశాభివృద్ధిలో, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఇటీవల కొందరు మావోయిస్టులు కీలక నాయకులు లొంగిపోయారని గుర్తు చేశారు. మిగిలిన వారు సైతం జన జీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.