అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన సత్తా చాటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆదివారం బెంగళూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)తో సరిహద్దు దాటి ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. ఈ ఆపరేషన్ భారత సైనిక సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసిందని పేర్కొన్నారు.
రక్షణ రంగంలో మేకిన్ ఇండియా సత్తా ఏంటో చూపించామన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో బెంగళూరు టెక్ఎంప్లాయీస్ (Bangalore Tech Employees) కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కొందరు అసూయపడేలా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని మోదీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని ఆయన పేర్కొన్నారు.
PM Modi | రైలులో ప్రయాణించిన మోదీ
బెంగళూరులోని ఆర్వీ రోడ్డు మెట్రో స్టేషన్‌ను బొమ్మసంద్రకు అనుసంధానించే రెండో దశ మెట్రో కారిడార్‌ను ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం ప్రారంభించారు. రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. కాగా బెంగళూరు నగరంలో ఎంతో కీలకమైన ఎల్లోలైన్ మెట్రో(Yellow Line Metro) పనులు నాలుగేళ్లుగా సాగుతున్నాయి. ఈ కారిడార్ ఎలక్ట్రానిక్ సిటీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు మేలు చేస్తుంది. దీనిని రూ.7,160 కోట్ల వ్యయంతో నిర్మించారు.
మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను(Vande Bharat Express Trains) జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన వందే భారత్ రైలులో ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. అలాగే మోదీ బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.15,610 కోట్లతో 44 కి.మీ. మేర మూడో దశలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.