అక్షరటుడే, లింగంపేట: KTR | రాష్ట్రంలో దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దెదించుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. లింగంపేటలో (Lingampet) శుక్రవారం నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ గర్జన సభలో ఆయన మాట్లాడారు. దళితుల పట్ల రేవంత్ ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
KTR | సాయిలుకు జరిగిన అవమానం క్షమించరానిది..
లింగంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇటీవల మాజీ ఎమ్మెల్యే జాజాల ఫొటోతో ఫ్లెక్సీ పెట్టిన మాజీ ఎంపీపీ సాయిలుకు పోలీసులు చేసిన అవమానం క్షమించరానిదన్నారు. ప్రభుత్వం అండచూసుకునే వారు అలా ప్రవర్తించారన్నారు. ఆయనకు జరిగిన అవమానాన్ని తెలంగాణకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు లింగంపేటకు వచ్చానని.. ఆనాడు జరిగిన ఘటనకు బద్లా తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సాయిలును సభలో సన్మానించారు.
KTR | 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టాం
అంబేడ్కర్ (Ambedkar) బోధించిన సూత్రాలను ఒంట బట్టించుకుని కేసీఆర్ 14 ఏళ్లు పోరాడితే తెలంగాణ సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. అంబేడ్కర్‌ను చూసి ప్రతిఒక్కరూ స్ఫూర్తిపొందేలా.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని (Ambedkar statue) హైదరాబాద్ నడిబొడ్డున బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అంబేడ్కర్ పేరును సెక్రటేరియట్‌కు (Secretariat) పెట్టుకున్నామని.. ఇలా ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 18 శాతం దళిత జనాభాకు న్యాయం చేయాలని ఉద్దేశంతో దళితబంధును కేసీఆర్ ప్రభుత్వం దశలవారీగా అమలు చేసిందని వివరించారు.
KTR | దళితులు ఇళ్లు కట్టుకుంటే ఓర్వలేకపోతున్నారు..
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Former MLA Jajala Surender) మాట్లాడుతూ.. దళితులు కష్టపడి ఇళ్లు కట్టుకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఓర్వలేకపోతున్నాడని ఆరోపించారు. దళితుడైన జేసీబీ డ్రైవర్ ఒక్కో రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేశారన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yella Reddy Constituency) దళితులను అవమానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డయేరియాతో తండ్రీకొడుకులు మృతి చెందితే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా కనీసం పరామర్శించలేదన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేను కలవాలంటే క్యూఆర్ కోడ్‌తోనే కలవాలని హుకూం జారీ చేశారని.. నియోజకవర్గం నిరంకుశ పాలనలో ఉందని చెప్పేందుకు ఇదొక సాక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
KTR | లెక్కకు లెక్క అప్పగించాల్సిందే.. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు లెక్కకు లెక్క అప్పగించాల్సిందేనని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. దానికి బదులుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి లెక్క అప్పజెబుదామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది ఎదురైనా పార్టీ అండగా ఉంటుందని వివరించారు. ముదాం సాయిలుకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న కేటీఆర్ అక్కడికి వెళ్లాలని తమతో మాట్లాడారన్నారు.
KTR | హరిహర వీరమళ్లు సినిమాకు రేట్లు ఎలా పెంచారు..: దేశపతి శ్రీనివాస్
తాను సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని పేర్కొన్న రేవంత్‌రెడ్డి హరిహర వీరమల్లు సినిమాకు రేట్లు ఎలా పెంచారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మెడ మీద కత్తి ఉంటుంది.. కాబట్టి పవన్‌కళ్యాణ్ సినిమాకు రేట్లు పెంచారని ఆరోపించారు. ముదాం సాయిలు ఏం తప్పుచేశాడని ఆయనను దుస్తులు లేకుండా పోలీస్‌స్టేషన్‌కు తరలించారని ప్రశ్నించారు. పోలీసులు దళిత సమాజాన్ని అవమాన పర్చారన్నారు. ఎక్కడ అవమానం జరిగిందే అక్కడే సాయిలును కేటీఆర్ సన్మానించారని గుర్తు చేశారు.
KTR | నిజానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్న పోరాటం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నేడు తెలంగాణలో దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో ప్రజలు అల్లాడుతున్నారని ఆర్ఎస్ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నిజానికి.. అబద్ధానికి మధ్య పోరాటం జరుగుతోందని.. ప్రజలు ఏవైపు ఉండాలో నిర్ణయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. మిట్మెంట్, కెపాసిటీ, క్యాలిబర్, కరిష్మా ఉన్న నాయకుడు కేటీఆర్ అని వివరించారు. ఇప్పుడు ఉన్న బాధలను, కన్నీళ్లను కసిగా పెంచుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు ప్రతిఇంటికి పోయి కడుపులో తలపెట్టి అప్పటి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వివరించాలని సూచించారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని స్పష్టంగా ప్రజలకు బీఆర్ఎస్ కార్యకర్తలు వివరించాలన్నారు.