అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Ponguleti Srinivas | సమ్మక్క సారలమ్మ దేవాలయ (Sammakka Saralamma Temple) అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 20 లోగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) ఆదేశించారు. నాణ్యతతో రాజేపడేది లేదని, తేడా వస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
బుధవారం ములుగు జిల్లాలోని మేడారం అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క (Minister Seethakka), కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. మేడారం లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. 19 ఎకరాలు భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ముఖ్యమంత్రి కోరిన విధంగా జంపన్నవాగు(Jampannavagu)పై చెక్ డ్యామ్ ల ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు తక్షణమే ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.
ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జాతరకు పక్షం రోజుల ముందుగానే అన్ని పనులను పూర్తి చేస్తామని, గిరిజన పూజార్ల సూచన మేరకే పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను పూర్తి చేస్తామన్నారు. వచ్చే రెండు వందల సంవత్సరాల కాలం పాటు శాశ్వతంగా నిలిచిపోయేలా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, 25 రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా ఆయా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, భవిష్యత్తులో 10 కోట్ల మంది భక్తులకు సరిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేడారం మాస్టర్ ప్లాన్(Medaram Master Plan)పై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఎంత డబ్బు ఖర్చు అయినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల గద్దెల ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, అన్ని పనులను పూర్తి చేసి రానున్న మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ (Minister Konda Surekha) మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, గతంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను నేటి ప్రజా ప్రభుత్వం చేస్తున్నదని వివరించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రాష్ట్ర పండుగగా గుర్తించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ దేవుళ్ళ ప్రాంతాలలో గిరిజనుల సాంప్రదాయ పద్ధతి ప్రకారమే గద్దెల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, గిరిజనుల అస్తిత్వం,ఆత్మగౌరవానికి విలువలు ఇస్తూనే పనులు చేపడుతున్నట్లు తెలిపారు, మరో వారం రోజుల్లో గా గద్దెల ప్రాంతం ఒక రూపానికి వస్తుందని వివరించారు.
