అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీల నేతలతో సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను (Governor Jishnu Dev Verma) కలుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలో పంపిన బిల్లులకు కేంద్రం ఆమోదం తెలుపలేదు. ఆర్డినెన్స్ తీసుకు రాగా గవర్నర్ సంతకం చేయలేదు. దీంతో పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసి బీసీ రిజర్వేషన్లు (BC Reservations) అమలు చేసేలా ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది.
BC Reservations | మా విధానం చెప్తాం
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu), ప్రధాని మోదీ (PM Modi) అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. దీంతో గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తామన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం అసెంబ్లీ వద్ద మాట్లాడారు. రాష్ట్రంలో స్థానికంగా జరిగే ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. తమ విధానం చెబుతామని.. అయితే నిర్ణయం గవర్నర్‌దేనని ఆయన పేర్కొన్నారు.
BC Reservations | రిజర్వేషన్లతోనే ఎన్నికలు
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. గవర్నర్‌ను కలవడానికి అన్ని పార్టీల నేతలు రావాలని ఆయన కోరారు. అయితే గవర్నర్ బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఆమోదించకుంటే స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు.