అక్షరటుడే, కామారెడ్డి : MLA Madan Mohan Rao | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) అన్నారు.
రామారెడ్డి మండలం కన్నాపూర్, సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి, కల్వరాల్, పద్మాజీవాడి, మోడెగాం, ధర్మరావుపేట, అమర్లబండ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను(Indiramma Houses) శనివారం ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదోడు ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజే విజయం సాధించిన వాళ్లమవుతామన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్(Housing Department MD Gautam)ను కలిసి నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.