అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్‌పై సుంకాలు పెంచుతానని హెచ్చరించారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఆపాలన్నారు.
రష్యా నుంచి ఆయిల్ (Crude Oil) దిగుమతి చేసుకుంటుందనే కారణంతో ఇప్పటికే ట్రంప్ భారత్ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే. పలు వస్తువులపై వంద శాతం వరకు సుంకాలు వేస్తున్నారు. ఆ దేశంలో భారత వస్తువుల ధరలు భారీగాయి. దీంతో అమెరికన్లు ఇతర దేశాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే టారిఫ్‌లతో ఇబ్బంది పడుతున్న భారత్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా చమురు సమస్య విషయంలో న్యూఢిల్లీ (New Delhi) సహాయం చేయకపోతే, భారతీయ దిగుమతులపై ఉన్న ప్రస్తుత సుంకాలను మరింత పెంచుతానని ప్రకటించారు.
Trump Tariffs | మోదీ మంచి వ్యక్తి
మోదీ (PM Modi) మంచి వ్యక్తి అని ట్రంప్ అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు సంతోషంగా లేరనే విషయం ఆయనకు తెలుసన్నారు. “నన్ను సంతోష పెట్టడం చాలా ముఖ్యం. మేము భారత్‌పై సుంకాలను త్వరగా పెంచగలం” అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా టారిఫ్‌ల విషయంలో భారత్–అమెరికా మధ్య చర్చలు సాగుతున్నాయి. త్వరలో ఇవి కొలిక్కి వస్తాయని అంతా భావించారు. అయితే తాజాగా మరోసారి టారిఫ్‌లు పెంచుతామని హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం విషయంతో ఆందోళన నెలకొంది.
Trump Tariffs | భారత్ ఏం చేస్తుందో..
రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఆపేయాలని అమెరికా చాలా కాలంగా భారత్‌పై ఒత్తిడి చేస్తోంది. అయితే భారత్ మాత్రం దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయిల్ దిగుమతులు కొనసాగిస్తోంది. మార్కెట్లలోని ఆఫర్లు, భారతీయ వినియోగదారుల అవసరాలపై ఆధారపడి చమురు కొంటామని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. దీంతో ఇది వరకే ట్రంప్ టారిఫ్‌లు విధించారు. అయినా న్యూఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా అధ్యక్షుడు మరోసారి భారత్‌పై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.