అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ (PCC Chief Mahesh Goud) అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు.
మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధి అందరికీ తెలిసిందే అన్నారు. బీసీలకు మేలు చేయడాన్ని బీఆర్ఎస్, బీజేపీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. దేశంలో తొలిసారి కులగణన (Caste Census) చేసింది మొదట తెలంగాణ ప్రభుత్వమే అని చెప్పారు. ఏది ఏమైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
BC Reservations | బీజేపీ బిల్లులు ఆపుతోంది
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమపై నిందలు వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. జీవో నంబర్ 9 తీసుకురావడానికి ముందే రాష్ట్రంలో కుల గణన చేపట్టామన్నారు. అయితే బీజేపీ బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆపుతోందని ఆయన ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ 50 శాతం శ్లాబ్ దాటకుండా చట్టం చేసిందని విమర్శించారు. రిజర్వేషన్లు సాధించేవరకు న్యాయస్థానాల్లో, రాజకీయంగా పోరాటం చేస్తామన్నారు.
BC Reservations | స్టే విధిస్తుందని ఊహించలేదు : పొన్నం
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇస్తుందని ఊహించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.
BC Reservations | నిరాశ చెందుతున్నాం
హైకోర్టు తీర్పుపై నిరాశ చెందుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని చెప్పారు. బీసీ బిడ్డల నోటికాడికి వచ్చిన ముద్దను అందకుండా చేస్తున్నారని మండి పడ్డారు.