అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi Reddy | కాళేశ్వరం నిర్మాణం (Kaleshwaram) జరిగిన అవినీతిని బయటపెట్టి ప్రజల ముందు కేసీఆర్ (KCR), హరీష్‌రావును (Harish rao) దోషులుగా నిలబెడతామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో తాము చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో కేసీఆర్, హరీష్‌రావులు హైకోర్టుకు వెళ్లారని విమర్శించారు. కేసీఆర్, హరీష్‌రావు హైకోర్టును (Highcourt) స్టే అడిగితే వారి పిటిషన్లను కోర్టు కొట్టివేసిందన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వారికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద అవినీతి అని.. సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నిర్వీర్యం అయిందన్నారు. వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలినా తాము తప్పు చేయలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటని భూపతిరెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం అవినీతిపై కమిటీ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్, హరీష్‌రావును అసెంబ్లీలో దోషులుగా నిలబెడతామన్నారు. ఘోష్ కమిటీని వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. నివేదిక వచ్చాక నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించడం చూస్తే బీఆర్ఎస్ తప్పు చేసినట్టు అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.
Mla Bhupathi Reddy | బీసీల రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బిల్లు
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం (BC Reservations) అసెంబ్లీలో బిల్లు పెట్టామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి వివరించారు. బిల్లును కేంద్రం ఆమోదించాలని ఢిల్లీ (Delhi)లోని జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద ధర్నా కూడా చేశామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మద్దతిచ్చి పార్లమెంట్లో సపోర్ట్ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్కు రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ది లేదని, కేసీఆర్ కుటుంబం కులగణనలో కూడా పాల్గొన లేదని గుర్తుచేశారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ రాష్ట్రంలో మద్దతిస్తున్నామని చెబుతూ.. కేంద్రంలో మాట మార్చడం ఎంతవరకు సబబని భూపతిరెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు బీసీల్లో ఉన్నారని వివరించారు. కానీ ఇక్కడ మాత్రం బీసీ రిజర్వేషన్ల కోటా ముస్లింలు ఉన్నారనే సాకు చూపించి అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
Mla Bhupathi Reddy | వందేళ్లలో ఎప్పుడూ లేనంత వరద..
రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాలతో పాటు నిజామాబాద్‌లోని ధర్పల్లి, సిరికొండ మండలాలను ముంచెత్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వందేళ్లలో ఎప్పుడూ లేనంత వరద వచ్చిందని ఇక్కడి పెద్దమనుషులు చెప్పారని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను వరద ముంచెత్తిందని, ప్రాణనష్టం జరగకున్నా ఆస్థినష్టం జరిగిందని చెప్పారు. వరదలపై ఎప్పటికప్పుడు స్పందించి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వ అధికారులు కూడా ఎంతో కష్టపడ్డారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క (Minister Seethakka) కూడా వరదలపై గంటగంటకు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేశారన్నారు.
వరదల వల్ల జరిగిన నష్టం విషయమై నివేదికలు తెప్పిస్తున్నామని, ప్రభుత్వం అన్ని విధాలా వరద బాధితులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సాయ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.