అక్షరటుడే, ఇందూరు : MLA Bhupathi Reddy | భారీ వర్షాల నేపథ్యంలో ముంపునకు గురైన గ్రామాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి(MLA Bhupathi Reddy) అన్నారు. ధర్పల్లి మండలం వాడి, నడిమి తండా, బీరప్ప తండాలను గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya)తో కలిసి పరిశీలించారు.
వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా వేశారు. ముంపు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన హొన్నాజీపేట పాఠశాల(Honnajipet School)ను సందర్శించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచామన్నారు.
గ్రామాల్లో విద్యుత్ తాగునీటి వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున ఎటువంటి వరద వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు.
కాగా.. అంతకుముందు రామడుగు, లోలం గ్రామాల వద్ద లోలెవెల్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్, సిపీలు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రాకపోకలను నిలిపివేయించారు. వీరి వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.