అక్షరటుడే, బోధన్: Mla Sudharshan Reddy | వరద బాధితులను ఆదుకుంటామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బోధన్ నియోజకవర్గంలోని (Bodhan Constituency) వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy), అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు.
గోదావరి(Godavari) ఉధృతి వల్ల నవీపేట్ మండలం యంచ, అల్జాపూర్, మిట్టాపూర్, కోస్లీ(Kosli) తదితర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రవాహం దాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ట్రాన్స్ ఫార్మర్లు తదితర వాటిని పరిశీలించారు. వరద నీటిలో మునిగి ఇసుక మేటలు వేసిన వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను చూశారు. కోస్లీ పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని గమనించారు. వరదలతో వాటిల్లిన నష్టం, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాధిత రైతులు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత రైతులు, ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా శ్రీరాంసాగర్‌కు (Sriramsagar) వరద పోటెత్తి గోదావరి పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్నారు. నాలుగు రోజులుగా వరి పైరు, ఇతర పంటలు నీట మునిగి ఉండడం వల్ల చేతికందే పరిస్థితి లేకుండాపోయిందన్నారు.
పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, బాధితులకు పరిహారం అందేలా కృషి చేస్తామని చెప్పారు. కాగా.. వరదల వల్ల వాటిల్లిన పంట నష్టం వివరాలను ఒక్క ఎకరం కూడా తప్పిపోకుండా పక్కాగా సేకరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుధ్ధ ప్రాతిపదికన చేపట్టాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లను కూడా వెంటనే మరమ్మతులు చేసి, రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, ప్రజలకు అండగా నిలవాలన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయాధికారి గోవిందు, వివిధ శాఖల అధికారులున్నారు.