అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | భారీవర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాత్కాలిక పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాశ్వతపనుల నిమిత్తం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కామారెడ్డి గురువారం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రులతో కలిసి సందర్శించారు.
కామారెడ్డి (Kamareddy), ఎల్లారెడ్డిలో (Yellareddy) తీవ్రంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలను పరిశీలిం చారు. అనంతరం లింగంపల్లి (Lingampally) వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను (Photo exhibition) తిలకించారు. ఆ తర్వాత ఆయన కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ.. (Housing Board Colony) జీఆర్ కాలనీల్లో (GR Colony) వరద బాధితులతో మాట్లాడారు.
భారీ వరదలతో కామారెడ్డి జిల్లా తీవ్రంగా ప్రభావితమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరద బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన ప్రసంగించారు. వరదలతో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నారు. తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడతానని తెలిపారు. శాశ్వత పనుల కోసం ప్రత్యేక నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇసుక మేటలు వేసిన పొలాలను తిరిగి సాగుకు యోగ్యంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధ్వంసమైన రోడ్లు, తెగిపోయిన చెరువుల మరమ్మతులకు శాశ్వత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy | అధికారులు ఎంతో శ్రమించారు..
వరదలు వచ్చిన సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టం జరుగకుండా చూశారని సీఎం ప్రశంసించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించినట్లు తెలిపారు. సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెగిన చెరువులు, కుంటలు, రోడ్లని బాగు చేయిస్తామని చెప్పారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు.
వరదలో కొట్టుకుపోయిన పిల్లలకు పాఠ్య పుస్తకాలు అందజేయడం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. కొడంగల్‌తో సమానంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం పేర్కొన్నారు. ఈ జిల్లాకు ప్రత్యేకంగా సహాయం అందించడానికి ఎల్లవేళలా ముందుంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు, వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా అధికారులు ఉన్నారు.