అక్షరటుడే, వెబ్డెస్క్: Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులాను తామే పరిపాలిస్తామని ప్రకటించారు.
వెనిజులాపై (Venezuela) అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను (Nicolas Maduro) అగ్రరాజ్యం బంధించి తీసుకెళ్లింది. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. వెనిజులాలో సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా తాము పరిపాలన చేస్తామని స్పస్టం చేశారు. అక్కడ చమురు వ్యాపానాన్ని అమెరికన్ కంపెనీలు నియంత్రణలోకి తీసుకుంటాయన్నారు. మౌలిక వసతులు కల్పించి వెనిజులాను అభివృద్ధి చేస్తామన్నారు.
Donald Trump | ప్రత్యర్థులకు హెచ్చరిక
వైమానిక దాడుల్లో వెనిజులా రాజధాని కారకాస్ చీకటిగా మారిందని, అమెరికన్ దళాలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. రహస్య సైనిక చర్యను ప్రశంసించారు. వెనిజులాలో సురక్షితమైన, సరైన, వివేకవంతమైన పరివర్తన చేయగలిగేంత వరకు తాము పరిపాలిస్తామన్నారు. నికోలస్ మదురో అరెస్టు తమ ప్రత్యర్థులకు హెచ్చరిక అని ట్రంప్ పేర్కొన్నారు. అవసరం అయితే మరోసారి వెనిజులాపై సైనిక చర్య చేపడుతామని హెచ్చరించారు.
Donald Trump | బెదిరింపులను సహించం
మదురో డ్రగ్స్ అక్రమ రవాణాను పర్యవేక్షిస్తున్నాడని, అమెరికాలోకి హింసాత్మక ముఠాలను పంపుతున్నాడని ట్రంప్ ఆరోపించారు. జైలు ముఠా ట్రెన్ డి అరగువా అమెరికన్ సమాజాలను భయభ్రాంతులకు గురిచేసిందని పేర్కొన్నారు. దానికి వెనిజులా నాయకత్వం మద్దతు తెలిపిందన్నారు. అలాంటి బెదిరింపులను ఇకపై సహించబోమని అన్నారు. వెనిజులాలోని సైన్యాన్ని నిర్వీర్యం చేశామన్నారు. మదురోకు మద్దతిచ్చే నేతలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. నియంత పాలన ముగియడంతో ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు.