అక్షరటుడే, వెబ్డెస్క్: Shehbaz Sharif | జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే పాక్ పౌరులకు వీసాలను రద్దు(Visa Cancel) చేసింది. ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాగా.. ఉగ్రదాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pak PM Shehbaz Sharif) నోరువిప్పారు. పహల్గామ్ దాడిపై తటస్థ దర్యాప్తునకు సిద్ధమని ప్రకటన చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
ఖైబర్ ఫక్తున్వాలోని పాకిస్తాన్(Pakistan) మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో షెహబాజ్(Shehbaz) స్పందించారు. ‘పహల్గామ్లో జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ షరీఫ్ ప్రకటించారు. శాంతికే మా ప్రాధాన్యం అని తెలిపారు. ‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సిద్ధం’ అని పేర్కొన్నారు. అనంతరం సింధూ జలాల ఒప్పందం గురించి మాట్లాడుతూ ‘భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ నిందించే ప్రయత్నం చేశారు.