అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sridhar Babu | హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) ఖండించారు. తమ ప్రభుత్వం వస్తే ఆక్షన్ భూములు, కన్వర్షన్ భూములు వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ (ktr) బెదిరించేలా మాట్లాడటం అప్రజాస్వామికం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు తమకు అధికారం ఇచ్చారని శ్రీధర్‌బాబు అన్నారు. రాజ్యాంగ పరంగా నిర్ణయాలు తీసుకునే హక్కు తమకు ఉందన్నారు. ఎక్కడ కూడా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒకరిద్దరి ఆలోచనల మేరకు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం భూములు ఎక్కడ అమ్ముకుందని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Sridhar Babu | పథకాలను అడ్డుకోవాలని..
ప్రైవేట్ వ్యక్తుల భూముల (private individuals lands) కన్వర్షన్ కోసం జీవో తెచ్చామని మంత్రి పేర్కొన్నారు. జీవో మాత్రమే వచ్చిందని.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. అప్పుడే కుంభకోణం అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫెయిల్ కావాలని, ఆదాయం రాకుండా సంక్షేమ పథకాలు ఆగాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారని విమర్శించారు.
Sridhar Babu | లీకేజీపై విచారణ
ఓఆర్ఆర్ (ORR) లోపల ఉన్న ఫ్యాక్టరీలను తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రభుత్వాన్ని అడ్డుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడుతామన్నారు. గతంలో లీజ్ ల్యాండ్స్‌ను ప్రైవేట్‌పరం చేశారని ఆరోపించారు. లీజ్ లాండ్స్ ఫ్రీ హోల్డ్ చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. పాలసీ లీకేజీపై విచారణ జరుగుతోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
