అక్షరటుడే, మెదక్ : MedaK | అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు (MLA Mynampally Rohit Rao) అన్నారు. మెదక్ (Medak) పట్టణంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యలకు రూ.3.53 కోట్ల రుణాల చెక్కు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ నగర్ కాలనీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు శంకుస్థాపన చేశామన్నారు. రూ. 2 కోట్ల 13 లక్షల వ్యయంతో మెదక్ చర్చి (Medak Church) మెయిన్ గేట్ నుంచి చర్చి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. రూ.8 లక్షల వ్యయంతో వెంకట్రావు నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో మెదక్ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. అనంతరం మున్సిపాలిటీలో శానిటేషన్ వర్కర్లకు శానిటేషన్ పరికరాలు, రెయిన్ కోట్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.