అక్షరటుడే, వెబ్డెస్క్ : SP Rajesh Chandra | జిల్లాలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర (kamareddy sp rajesh chandra) తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లాలోని రౌడీ షీటర్ల (rowdy sheeters)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఆరు నెలలకు ఒకసారి రౌడీ మేళా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
SP Rajesh Chandra | 13 మందిపై రౌడీ షీట్ ఎత్తివేత
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ సూచించారు. పోలీసు రికార్డ్స్, జిల్లా పోలీసు అధికారుల కమిటీ నివేదిక ప్రకారం మంచి ప్రవర్తన కనబరిచిన 13 మందిపై రౌడీ షీట్లు ఎత్తివేసినట్లు ఆయన తెలిపారు. నిష్పక్షపాత విచారణతో కమిటీ నివేదిక ఆధారంగా 10 ఏళ్లుగా సత్ప్రవర్తనతో ఉన్నవారిపై రౌడీ షీట్ ఎత్తివేశామన్నారు. మిగతా వారు కూడా పద్ధతి మార్చుకొని మెలగాలని సూచించారు.
SP Rajesh Chandra | వారిపై కఠిన చర్యలు
రౌడీయిజాన్ని ప్రోత్సహించే చర్యలకు జిల్లాలో చోటులేదని ఎస్పీ స్పష్టం చేశారు. రౌడీ షీట్లు ఉండి మరలా నేరాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, హింసాత్మక చర్యలు చేయడం లాంటి నేరాలను పూర్తిగా మానుకోవాలని సూచించారు. మంచి ప్రవర్తన కనబరిచిన వారి రౌడీషీట్లు మాత్రమే తొలగిస్తామన్నారు. గంజాయి, రౌడీయిజం, హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు మొదలైన అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పడుతున్న రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ (pd act) కూడా పెడతామని ఆయన హెచ్చరించారు.
అలాగే సోషల్ మీడియా (social media)లో కత్తులతో ఫొటోలు పోస్ట్ చేయడం, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం చేస్తే సహించమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, డీసీఆర్బీ సీఐ మురళి పాల్గొన్నారు.