అక్షరటుడే, ఇందూరు : MP Arvind | నిజామాబాద్ (Nizamabad) పేరును ఇందూరుగా మారుస్తామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా పేరు మార్పు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Municipal Corporation Elections) ఈసారి గెలుపు బీజేపీదేనని ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మున్సిపల్ పీఠం కొంతలో చేయి జారిందన్నారు. ఎన్నో పథకాలు కేంద్రం నుంచి వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయడం లేదన్నారు. పనిచేయని ప్రభుత్వాలకు ఓటు వేయొద్దన్నారు. గత పదేళ్లలో నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గుర్తు చేశారు.
MP Arvind | గ్రామాభివృద్ధి కోసమే జీ రాం జీ చట్టం
గ్రామాభివృద్ధి కోసమే జీ రాం జీ ఉపాధి హామీ పథకం మార్పు జరిగినట్టు ఎంపీ తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసం చట్టాన్ని రూపొందించారని.. దీనిని వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్కు ఇబ్బంది బీజేపీతోనా..రాముడితోనా.. లేదా కేంద్ర ప్రభుత్వంతోనా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వంద రోజులు పని రోజులు ఉంటే దాన్ని 125 రోజులకు పెంచామన్నారు. ప్రధానంగా ఆదివాసీలకు ఎస్టీలకు మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉందన్నారు. నూతన చట్టంతో ప్రతివారం నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు.
MP Arvind | రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉండాలని..
రాష్ట్ర ప్రభుత్వం (State Government) మీద బాధ్యత ఉండేందుకు 40 శాతం నిధులు కేటాయించేలా చట్టం రూపొందించామన్నారు. పనిచేయని ప్రభుత్వాలకు ఈ చట్టం ఇబ్బందికరంగా ఉందన్నారు. వ్యవసాయ పనులకు సైతం ఉపాధి హామీ కింద పనిచేసుకోవచ్చని వివరించారు. నిరుద్యోగులకు ఈ పథకం ఉపాధినిస్తుందని చెప్పారు. గ్రామ అభివృద్ధికి నిరుద్యోగులకు ఉపయోగపడే పథకంపై రాజకీయాలు చేయొద్దని కోరారు. పథకంపై జీవో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం తగదన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.