అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది. విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.
మొదటి దశలో ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసింది. ఇటీవల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఆయా గ్రామాల్లో ఇల్లు మంజూరైన నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తల తాకట్టు పెట్టైనా వచ్చే మూడున్నరేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు భారీగా డిమాండ్ ఉందని మంత్రి తెలిపారు.
Indiramma Houses | హైదరాబాద్‌లో 52,500 ఇళ్లు
హైదరాబాద్ (Hyderabad) నగరంలో స్థలం కొరత నేపథ్యంలో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో 52,500 ఇళ్లు నిర్మిస్తామని ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.