అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | గత ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల ఇండ్లను కూలగొడుతున్నాడని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చుతున్న రేవంత్‌రెడ్డి.. పెద్దల ఇండ్లపైకి బుల్డోజర్లు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో కేటీఆర్ (KTR) మాట్లాడారు. అంతకు ముందు హైడ్రా చేసిన దారుణాలను వీడియో రూపంలో కేటీఆర్ చూపించారు. హైడ్రా పేదల కడుపు కొడుతూ, ఇండ్లు ఎలా కూలగొడుతుందో వీడియోలను ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా హైడ్రా బాధితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కనీసం నోటీసులు లేకుండానే తమ ఇళ్ళను హైడ్రా అధికారులు కూల్చివేశారని కన్నీటి పర్యంతమయ్యారు. సామాన్లు సైతం తీసుకోకుండా కూల్చివేయడంతో రోడ్డును పడ్డామన్నారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు.
KTR | పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) పేదల పట్ల ఒకరకంగా, పెద్దల పట్ల మరో రకంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి నివాసాలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయని, వాటి జోలికి హైడ్రా ఎందుకు వెళ్లదని ప్రశ్నించారు. పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం కాదు, అందరికి ఒకటే న్యాయమన్న హైడ్రా వాళ్ల ఇండ్లను ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లనే ఇవాళ రేవంత్ రెడ్డి కూల్చేశాడన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్లకి ఇందిరమ్మ ఇస్తే ఎవరో బిల్డర్ కోసం రేవంత్ వాటిని కూల్చేశాడని తెలిపారు. పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం ఉండదు.. అందరికీ ఒకటే న్యాయమన్న హైడ్రా.. చెరువులు కబ్జా చేసిన కట్టిన రేవంత్ సోదరుడు, పొంగులేటి, వివేక్, పట్నం మహేందర్‌రెడ్డి ఇండ్లను ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తుందా? వాళ్లకు నోటీసులు ఇచ్చే దమ్ము హైడ్రా (Hydraa) అధికారులకు ఉందా? అని కేటీఆర్ నిలదీశారు.
KTR | మేం నిర్మిస్తే వీళ్లు కూలగొడుతున్నారు..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించామని, కానీ రేవంత్ సర్కారు మాత్రం కట్టుడు బదులు కూలగొడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ (KCR) పాలనలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేశామని చెప్పారు. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదని దుయ్యబట్టారు. 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. నగరంలో హైడ్రా బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా? అంటూ హైడ్రా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రాపై భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారని.. కానీ ఇప్పటివరకూ ఒక్కరిపై కూడా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. గాజులరామారం వద్ద బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భూమిని అలానే ఉంచారని.. పేదల ఇల్లు మాత్రం కూల్చివేశారని మండిపడ్డారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టే ఆయన భూమిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీఎం ఒత్తిడితో అధికారులు అక్కడ ఉండే ఆయన భూమికి ఫెన్సింగ్ వేశారని చెప్పారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు, అధికారులు ఎందుకు కూల్చలేదన్నారు.
