అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి చేసినప్పుడే మనపేరు చరిత్ర పుటల్లో నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. పట్టణంలో శనివారం అమృత్ (Amrit Scheme) 2.0 పథకం కింద రూ.65.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన పాల్గొన్నారు.
Shabbir Ali | తాగునీటి కోసం భారీ కేటాయింపులు..
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలో (Kamareddy City) తాగునీటి సౌకర్యం కోసం భారీ కేటాయింపులు చేపట్టడం జరిగిందన్నారు. పట్టణంలోని (Kamareddy Municipality) వివిధ ప్రాంతాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు నాలుగు నూతన భారీ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇస్లాంపుర కాలనీలో రూ.1.02 కోట్లతో నిర్మించబోయే 5లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు, లిటిల్ స్కాలర్ స్కూల్ ప్రాంతంలో రూ. 1.03 కోట్లు, గ్రీన్ సిటీ కాలనీలో 5 రూ.1.02 కోట్లు, డ్రైవర్స్ కాలనీలో రూ.1.02 కోట్లతో నిర్మించబోయే వాటర్ ట్యాంకుల పనులకు శంకుస్థాపన చేశారు.
Shabbir Ali | కులమత రాజకీయాలకు దూరం..
కామారెడ్డి పట్టణంలోని వికాస్‌నగర్, లింగాపూర్ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు షబ్బీర్‌అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, మనుషులు కూడా శాశ్వతం కాదని, చేసే అభివృద్ధి పనులు మాత్రమే కలకాలం నిలిచిపోతాయన్నారు. రాజకీయం అనేది నీతిగా, నిజాయితీగా ఉండాలన్నారు. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడమే అసలైన విజయమని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కుల మత రాజకీయాలకు దూరంగా ఉంటానని, అభివృద్ధి విషయంలో వివక్షకు తావు లేదన్నారు. అందరికీ సమానమైన ఫలాలు అందాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.