అక్షరటుడే, హైదరాబాద్ : Ande Sri | ప్రజాకవి, రచయిత అందెశ్రీకి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. లాలాపేట నుంచి ఘట్కేసర్ వరకు సాగిన ఆయన అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. కళాకారులు అంతిమ యాత్రలో పాల్గొని పాటులు, నృత్యంతో నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
అందెశ్రీ (Ande Sri) సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఘట్కేసర్ (Ghatkesar)లోని ఎన్ఎఫ్సీ నగర్లో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో మంత్రులు సీతక్క (Minister Seethakka), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పలువురు నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. అంత్యక్రియలకు సీఎం రేవంత్రెడ్డి హాజరై పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించారు.
Ande Sri | కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో అందెశ్రీ పాత్ర మరువలేనిదన్నారు. అందెశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని తెలిపారు. ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. రాజకీయ నేతలను నేరుగా కలవనని అందెశ్రీ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉన్నంత వరకు ఆయన కీర్తి శాశ్వతం నిలిచిపోతుందన్నారు. కళాకారుడిగా, రచయితగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని చెప్పారు.
Ande Sri | తీరని నష్టం
అందెశ్రీ మృతి తెలంగాణకు తీరని నష్టమని సీఎం అన్నారు. తన గళాన్ని, కలాన్ని తెలంగాణ (Telangana) సమాజానికి ఆయన అంకితం ఇచ్చారని కొనియాడారు. ఆయన రచనలను పుస్తక రూపంలో తీసుకొస్తామని తెలిపారు. చివరి వరకు అందెశ్రీ సాధారణ జీవితం గడిపారని చెప్పారు. ఆయన పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయనకు పద్మశ్రీ దక్కేలా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహకరించాలని కోరారు.
