అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో (Banswada government hospital) ఏజెన్సీలకు బిల్లులు తగ్గించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు పేర్కొన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం బాన్సువాడ ఏరియా ఆస్పత్రి, ఎంసీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
బాన్సువాడ పట్టణంలో ఏరియా ఆస్పత్రి, ఎంసీఎచ్ ఆస్పత్రి (MCH hospital) కలిపి 200 పడకలు ఉండగా 150 పడకలకు సంబంధించి ఏజెన్సీకి ప్రభుత్వం బిల్లులు చెల్లించారన్నారు. ఇటీవల తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులు బాన్సువాడ ఆస్పత్రి (Banswada Hospital) ఇన్ పేషంట్, అవుట్ పేషెంట్లలో 75 శాతం సెన్సెస్ తక్కువగా ఉందనే తప్పుడు సమాచారంతో 150 పడకలకు బిల్లులు కుదించారని ఆయన మండిపడ్డారు.
ఆస్పత్రి నుంచి తప్పుడు రిపోర్టులు పంపడం వల్లే సమస్య ఎదురైందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక (Maharashtra and Karnataka) నుంచి ప్రతిరోజు ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ కలిపి 1,000 నుంచి 1,500 మంది పేషెంట్లు వస్తారని ఆయన అన్నారు.
బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి కాయకల్ప లాంటి అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. 150 పడకులకు బిల్లులు తగ్గించడం వల్ల సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్కు 150 పడకులకే బిల్లులు ఇచ్చారన్నారు. దీంతో పండుగ సందర్భంగా కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైందని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రేణుక, ధనుంజయ్, లక్ష్మణ్, మహేందర్, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.