అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అమ్మాయికి అబార్షన్ చేసే విషయంలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి (multi-specialty hospital) నిబంధనలు తుంగలో తొక్కింది. డబ్బులే పరమావధిగా చేయాల్సిందంతా చేసింది. తీరా మాకేం తెలియదు అంటూ బుకాయిస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీస్కు అర్థపర్ధం లేని సమాధానాలు ఇస్తోంది సదరు ఆస్పత్రి యాజమాన్యం.
Kamareddy | అబార్షన్ చేయడమే తప్పు.. పైనుంచి..
పెళ్లి కాకుండానే గర్భవతి అయిన అమ్మాయికి అబార్షన్ చేయగా ఈ ఘటనను ‘అక్షరటుడే’ (Akshara Today) వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనంలో జిల్లా యంత్రాంగం కదిలివచ్చింది. వైద్యాధికారులు విచారణకు ఆదేశించగా.. పోలీసులు విచారణ చేసి పోక్సో కేసు నమోదు (POCSO case) చేశారు. అయితే ఇలా చట్టవిరుద్దంగా అబార్షన్ చేసిన ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల వింత సమాధానాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
రెండు రోజుల క్రితం స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు కడుపు నొప్పి అని వస్తే స్కానింగ్ చేశామని.. అందులో ఆమెకు ప్రెగ్నెన్సీ బయట పడిందని పొంతన లేని సమాధానం చెప్పింది. ఈ విషయం మర్చిపోకముందే అబార్షన్ చేసిన ఆస్పత్రి యాజమాన్యం కూడా అదే రీతిలో వింత సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం.
Kamareddy | ఎమర్జెన్సీలో వస్తే చేశాం
ఈనెల 9న పెళ్లి కాని అమ్మాయికి అబార్షన్ చేసిన ఘటనపై జిల్లా వైద్యాధికారులు సంబంధిత ఆస్పత్రి యాజమాన్యం, స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఇప్పటికే స్కానింగ్ సెంటర్ (scanning center) నిర్వాహకుడు స్పందించగా గడువు చివరి రోజైన శనివారం ఆస్పత్రి యాజమాన్యం కూడా జిల్లా వైద్యాధికారికి సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది. ‘సదరు అమ్మాయి మా ఆస్పత్రికి తీవ్ర రక్తస్రావంతో అత్యవసర పరిస్థితిలో వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయికి అబార్షన్ చేయాల్సి వచ్చింది. అంతేకాని మాకు ఇదంతా తెలియదు. మేము కావాలని చేయలేదు’ అని అధికారులకు సమాధానమిచ్చినట్టుగా సమాచారం. ఈ వింత సమాధానంపై అధికారులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఈ విషయమై ఎంటీపీ కమిటీకి విచారణ చేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రోగ్రాం ఆఫీసర్ ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.
Kamareddy | ఇక పోలీసు శాఖ వంతు..
అబార్షన్ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భానికి కారణమైన వ్యక్తిపై పొక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు విచారణను ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు విధుల్లో బిజీగా ఉన్నారు. అబార్షన్ ఘటనలో వైద్యాధికారుల విచారణ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ప్రోగ్రాం ఆఫీసర్ ఇచ్చే నివేదికను అధికారులు పోలీసులకు ఇవ్వనున్నట్టుగా సమాచారం. అనంతరం పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆస్పత్రిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.
Kamareddy | చర్యలు తీసుకోకుండా ప్రయత్నాలు..
అయితే ఇటు వైద్యాధికారులు, అటు పోలీసులను తమపై చర్యలు తీసుకోకుండా ఆస్పత్రి యాజమాన్యం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. ఆస్పత్రి యాజమాన్య ప్రయత్నాలకు తలొగ్గితే సదరు వైద్యాధికారులు నామమాత్రపు జరిమానా విధించి చేతులు దులుపుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే జరిగితే మిగితా ఆస్పత్రులు, అందులో పనిచేసే గైనకాలజిస్టులు ఇదే విధానాన్ని పాటిస్తూ విచ్చలవిడిగా అబార్షన్లు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి పోలీసు, వైద్యాధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటారా..లేదా వేచిచూడాల్సిందే.