అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకపోవడంతో దెబ్బతిన్నట్లు చెప్పారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో (BRS Sarpanches) కేటీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలను పట్టించుకోకపోవడంతోనే తాము ఓడిపోయామన్నారు. కాంగ్రెస్, బీజేపీ తమను ఓడగొట్టలేదని చెప్పారు. తామే కొన్ని పొరపాట్లు చేసినట్లు ఒప్పుకున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలకు రావాల్సిన బిల్లులు ఇప్పించలేదన్నారు. నాయకులకు, వారికి మధ్య గ్యాప్ పెరగడంతో వారు ఎన్నికల సమయంలో పూర్తిస్థాయిలో పని చేయలేదన్నారు.
KTR | కడియం శ్రీహరి, పోచారంపై ఫైర్
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి (Kadiyam Srihari), పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై (Pocharam Srinivas Reddy) కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏ రోగం, సిగ్గు లేకుండా కాంగ్రెస్‌లో చేరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం సంపాదించుకున్న పేరును నాశనం చేసుకున్నారని విమర్శించారు. అన్ని పదవులు అనుభవించిన పోచారం పార్టీ ఎందుకు మారారో అర్థం కావడం లేదన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి ఉపన్యాసాలు ఇచ్చాడన్నారు. అయితే ప్రస్తుతం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఆడ, మగ చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏం చెబితే స్పీకర్ అదే చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే స్పీకర్‌కు కనిపించడం లేదు, వినిపించడం లేదు అన్నారు.
KTR | అధికార బలంతో ఓడగొట్టారు
కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజకీయం గలీజ్‌గా మారిపోయాయని కేటీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడలో సర్పంచ్‌గా యాదగిరి అనే వ్యక్తి నామినేషన్ వేస్తే కాంగ్రెస్ నాయకులు అతన్ని బెదిరించి కొట్టారన్నారు. పలు గ్రామాల్లో బీఆర్ఎస్ గెలిచిన తర్వాత అధికార బలంతో రీకౌంటింగ్ పెట్టి ఓడగొట్టారని ఆరోపించారు. వీటిపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. భువనగిరి జిల్లాలో 151 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.