అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ‘ఓ అమ్మాయి కడుపునొప్పి అని మా దగ్గరకు వచ్చింది. స్కాన్ చేస్తే ప్రెగ్నెన్సీ బయటపడింది. అంతే తప్ప ఈ ఘటనపై మాకు ఎలాంటి సంబంధం లేదు.’ ఇటీవల పెళ్లికాని యువతికి అబార్షన్ ఘటనపై వైద్యశాఖ నుంచి నోటీసు అందుకున్న స్కానింగ్ సెంటర్ (scanning center) యాజమాన్యం సమాధానం ఇది.
Kamareddy | షోకాజ్‌కు పొంతనలేని సమాధానం..
ఇటీవల ఓ అమ్మాయి గర్భం దాల్చగా ఆమెకు అబార్షన్ చేసిన ఘటనలో స్కానింగ్ సెంటర్‌కు, ఓ ఆస్పత్రికి షోకాజ్ నోటీస్‌లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అధికారుల నోటీసుపై స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు పొంతనలేని సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది. సదరు అమ్మాయి తన సెంటర్‌కు కడుపునొప్పి అని వచ్చిందని స్కాన్ చేస్తే ప్రెగ్నెన్సీ బయటపడిందని పేర్కొంది. అంతే తప్ప ఈ ఘటనలో తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులపుకునే ప్రయత్నం చేసిందని సమాచారం. ఈ రకమైన సమాధానాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు (health department officials) సమర్థిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
Kamareddy | నోటీసులపై స్పందించని ఆస్పత్రి
అయితే సదరు అమ్మాయికి ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అబార్షన్ చేసినట్టుగా పోలీసులు, వైద్యాధికారులు తేల్చారు. విచారణలో భాగంగా వైద్యాధికారులు ఆ ఆస్పత్రికి, అబార్షన్ చేసిన గైనిక్ వైద్యురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు సదరు ఆస్పత్రి గాని, గైనిక్ వైద్యురాలు గాని షోకాజ్ నోటీసులపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే అధికారులు ఇచ్చిన నోటీసుకు శనివారం వరకు సమాధానం ఇచ్చేందుకు సమయం ఉన్నట్టుగా తెలుస్తోంది. శనివారం ఆస్పత్రి నుంచి అధికారులకు సమాధానమిస్తారా.. లేక వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది.