అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CM visit to Nizamabad | సీఎం బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు బర్దిపూర్ శివారులోని కేశాపూర్‌లో శుక్రవారం సీఎం సభ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
CM visit to Nizamabad | భద్రత ఏర్పాట్ల పరిశీలన
ఈ సందర్భంగా సభ నిర్వహించే ప్రాంగణం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, అత్యవసర వాహనాల రాకపోకల మార్గాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి (CM Revanth Reddy) రాక కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించి, భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
CM visit to Nizamabad | పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు..
అలాగే సభకు హాజరయ్యే ప్రజలను దృష్టిలో ఉంచుకుని వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు (traffic diversion routes), పాదచారుల సౌకర్యాలను సీపీ పర్యవేక్షించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (QRT), అంబులెన్సులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బందోబస్తుపై స్థానిక పోలీస్ అధికారులు, ఇతర విభాగాలతో సమీక్ష నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణ, గుంపు నియంత్రణ వంటి అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.
ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలి..
ప్రతి అధికారి పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సీపీ తెలిపారు. సీఎం పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా, విజయవంతంగా ముగిసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా దాదాపు 1,200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో నిజామాబాద్ జిల్లా అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్) రాంచంద్రరావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.