అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Shabbir Ali | ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా అర్హులైన 44 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ (Shadi Mubarak), కళ్యాణ లక్ష్మి పథకం (Kalyana Lakshmi) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం తీవ్రమైన అప్పుల్లో ఉన్నప్పటికీ పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తోందన్నారు.
కళ్యాణ లక్ష్మి కింద 95 మంది లబ్ధిదారులకు రూ.95,11,020 పంపిణీ చేశామని తెలిపారు. అలాగే షాదీ ముబారక్ పథకం కింద 349 లబ్ధిదారులకు రూ.3,49,40,484 అందించామన్నారు. మొత్తం లబ్ధిదారులకు రూ.4,44,51,504 అందించామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామన్నారు. రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, సన్న బియ్యం పథకాలను పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.
కనీసం నగదైనా పెంచి ఇవ్వండి..
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం అందజేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కనీసం ఈ పథకం కింద ఇస్తున్న నగదును కొంతమేరకు పెంచి ఇచ్చినట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఈ పథకాలను ఇచ్చే నగదును పెంచి ఇవ్వాలను పలువురు లబ్ధిదారులు తమను సంప్రదించారన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.