అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Group 1 Rankers | రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పడంతో ర్యాంకు సాధించిన వారు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం గ్రూప్–1 ర్యాంకర్ల తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్(Somajiguda Press Club)లో మాట్లాడారు.
గ్రూప్–1 పరీక్షల మూల్యాంకనం(Group 1 Exams Evaluation)లో సక్రమంగా జరగలేదని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రీవాల్యూయేషన్(Revaluation) చేపట్టాలని, లేదంటే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు తర్వాత తొలిసారి ర్యాంకర్లు, వారి పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చారు. రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్‌తో ఆడుకోవద్దని వారు కోరారు.
Group 1 Rankers | కష్టపడి చదివించాం
గ్రూప్–1 ఉద్యోగాలను రూ.3 కోట్లకు అమ్ముకున్నట్లు పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ర్యాంకర్ల(Group 1 Rankers) తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమపై వస్తున్న ఆరోపణలపై అభ్యంతరం తెలిపారు. తమలో కొందరికి కూటికి కూడా గతి లేదని, కష్టపడి, పస్తులుండి అప్పులు చేసి పిల్లలను చదివించామన్నారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా పిల్లలు చదివి ర్యాంకులు సాధించారని చెప్పారు. అయితే రాజకీయ నాయకుల ఆరోపణలతో తమ బిడ్డలను
సమాజం చిన్న చూపు చూసే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Group 1 Rankers | ఆరోపణలు నిరూపించాలి
200 మంది ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తప్పుడు ప్రచారంతో తాము తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నామని వాపోయారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. ‘‘మీ రాజకీయాల కోసం మా పిల్లల జీవితాలను నాశనం చేయకండి. మా నోటి కాడ కూడు లాక్కొకండి. మళ్లీ పరీక్షలు పెడితే అవి సజావుగా జరుగుతాయని గ్యారెంటీ ఏంటి” అని వారు ప్రశ్నించారు. రాజకీయ నాయకుల ఆరోపణలతో ర్యాంకులు తెచ్చుకున్న తమ పిల్లలు తల దించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారని, అలా అని ఓడిపోయిన నేతలు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టుకు వెళ్తారా అని ప్రశ్నించారు.