అక్షరటుడే, ఇందూరు : AIFB | బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డీఐని భారత ప్రభుత్వం (India Government) అనుమతించడాన్ని ఖండిస్తున్నామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ అనాలోచితమైన నిర్ణయం జాతీయ ప్రయోజనాలకు హానికరమన్నారు. దేశ ఆర్థిక భద్రతకు, ఆర్థిక సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
AIFB | విదేశీ పెట్టుబడులకు అప్పగించడం..
బీమా వంటి కీలక, సున్నితమైన రంగాన్ని పూర్తిగా విదేశీ పెట్టుబడికి అప్పగించడం ద్వారా, భారత ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాలనే తమ బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. బీమారంగం (Insurance Sector) దేశీయ పొదుపును సమీకరించడంలో, కోట్లాది మంది పౌరులకు సామాజిక, ఆర్థిక భద్రతను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి రంగాన్ని విదేశీయుల పరంచేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
AIFB | లాభాలు పెంచుకోవడమే లక్ష్యంగా..
విదేశీ పెట్టుబడులను దేశంలో అనుమతించి ప్రజా సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Government) పక్కన పెట్టిందని రాజుగౌడ్ పేర్కొన్నారు. ఇది బహుళజాతి సంస్థల ఆధిపత్యానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రధాన బీమా సంస్థ పతనం వల్ల అమెరికాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిందని.. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావాన్ని చూపించిందన్నారు. వాణిజ్య ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేసే ప్రైవేట్, విదేశీ సంస్థలు, క్లెయిమ్‌ల పరిష్కారాన్ని తగ్గించడానికి, వారి సామాజిక బాధ్యతలను తప్పించుకోవడానికి అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తాయని వివరించారు. తద్వారా బీమా అసలు ఉద్దేశాన్నే దెబ్బతీస్తాయని తెలియజేశారు.
AIFB | విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా..
ప్రభుత్వ నిర్ణయం బీమా రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని రాజుగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ నియంత్రణ పెరగడం వల్ల ఉద్యోగ అభద్రత, కార్మికుల ఒప్పందీకరణ (Contractualisation), కార్మికుల హక్కులు బలహీనపడడం లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు. అందుకే బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డీఐలను అనుమతించడాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.